యుద్ధం ఆపేయటం.. ఉక్రెయిన్ విలువైన ఖనిజాల తవ్వకానికి అమెరికాకు అవకాశం ఇచ్చేందుకు వీలుగా ఏర్పాటైన భేటీ ఎలా ముగిసిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. మీడియా ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ భేటీ జరగటం.. అది కాస్తా రచ్చగా మారటం.. ఒప్పందం మీద సంతకం చేయకుండానే వెళ్లిపోవటం తెలిసిందే. ఒప్పందంపై సంతకం విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్ స్కీతో జరిగిన వాగ్వాదంపై ట్రంప్ రియాక్షన్ ఏమిటి? మీడియాతో ఆ అంశంపై ఆయన ఎలా రియాక్టు అయ్యారన్నది చూస్తే..
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో తాను భేటీ అయ్యానని.. ఈ భేటీలో ఆయన కాస్త అతి చేసినట్లుగా తనకు అనిపించినట్లుగా ట్రంప్ వ్యాఖ్యానించారు. తాము శాంతి కోసం చూస్తున్నామని.. కానీ ఆయన అలా కోరుకుంటున్నట్లుగా కనిపించలేదన్నారు. మరో పదేళ్లు యుద్ధానికి వెళ్లి ఆటలాడాలని తాము అనుకోవటం లేదన్నారు. ‘‘శాంతి నెలకొల్పాలని నేను చూస్తున్నా. ఆయన మరో దాన్ని ఆశిస్తున్నారు. మాకు తక్షణమే శాంతి కావాలి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా శాంతినే కోరుకుంటున్నారు. ఈ యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నారు’’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘జెలెన్ స్కీతో శాంతి చర్చలు కొనసాగిస్తారా?’ అని ప్రశ్నించగా.. ఆయన అందుకు రావాలనుకుంటున్నారని.. కానీ తాను అందుకు సిద్ధంగా లేనని ట్రంప్ బదులిచ్చారు. జెలెన్ స్కీ శాంతిని కోరుకోవటం లేదని.. ఆయన అలాంటి వ్యక్తే కాదని విమర్శించటం గమనార్హం. రష్యా – ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందాన్ని కుదర్చటానికి బదులుగా కీవ్ లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.
ఈ ఒప్పందంపై చర్చించేందుకు ట్రంప్ తో భేటీ అయ్యారు ఉక్రెయిన్ అధ్యక్షులు. అయితే.. ఈ సందర్భంగా ఆయనో కీలక అంశాన్ని లేవనెత్తారు. భవిష్యత్తులో రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని కోరటం.. దానిపై తనకు హామీ కావాలని కోరటం ట్రంప్ నకు ఆగ్రహానికి గురి చేసింది. ఆయన అడిగే స్థితిలో లేదంటూ అగ్రరాజ్య అహంకారాన్ని ట్రంప్ తన మాటల్లో వ్యక్తం చేయటం కనిపించింది. దీంతో.. చర్చలు మధ్యలోనే ఆగిపోయి జెలెన్ స్కీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా.. మరో కీలక అంశానికి సంబంధించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అమెరికాలో అత్యధికులు మాట్లాడే భాష ఇంగ్లిష్. అయినప్పటికీ అమెరికా అధికారిక భాషగా ఏ లాంగ్వేజ్ కు ప్రత్యేకంగా గుర్తింపు లేదు. ఇప్పుడు ఆంగ్లానికి ఆ హోదా కల్పించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇంగ్లిష్ ను దేశమంతా అధికార భాషగా గుర్తిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ట్రంప్ సంతకం చేయబోతున్నట్లుగా వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అయితే.. ఈ ఉత్తర్వు మీద ట్రంప్ ఎప్పుడు సంతకం చేస్తారో మాత్రం బయటకు రాలేదు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంగ్లిషును తమ అధికారిక భాషగా ఇప్పటికే గుర్తించాయి.