కొన్ని సందర్భాల్లో కొన్ని ఉదంతాల గురించి విన్నప్పుడు.. అప్పటివరకు సదరు వ్యక్తి మీద ఉండే అభిప్రాయానికి భిన్నమైన భావన కలుగుతుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. అమెరికాకు మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన డొనాల్డ్ ట్రంప్ మాట ఎత్తితేనే.. అతనిపై బోలెడన్ని ఫిర్యాదులు చేయటానికి సిద్ధంగా చాలామంది ఉంటారు. అలాంటి ఆయనపై చాలానే ఆరోపణలు ఉన్నాయి. మహిళల్ని ఆయన సరిగా ట్రీట్ చేయరని.. చులకన భావం ఉంటుందన్న విమర్శ వినిపిస్తూ ఉంటుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆయన వెల్లడించిన సమాచారం గురించి తెలిసినంతనే.. ట్రంప్ మీద ఉన్న కొన్ని ముద్రలు తొలిగే అవకాశం ఉందని చెప్పాలి. తన మొదటి భార్య 73 ఏళ్ల ఇవానా ట్రంప్ మరణించిన విషయాన్ని తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం వేదికగా ట్రంప్ వెల్లడించారు. న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లో ఉన్న ఆమె నివాసంలో మరణించినట్లుగా వెల్లడించారు.
‘ఇవానా అందమైన.. అద్భుతమైన మహిళ. ఆమె అందరికీ ఆదర్శంగా నిలిచే జీవితాన్ని గడిపారు’ అంటూ తన మాజీ భార్య గురించి పోస్టు పెట్టారు. తనకు ఇది చాలా విచారకరమైన రోజుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన తల్లి మరణాన్ని తెలియజేస్తూ.. ఆమెతో కలిసి ఉన్న ఫోటోను ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ షేర్ చేశారు. తన తల్లి తెలివైన.. మనోహరమైన మహిళగా ఇవాంకా అభివర్ణించారు. తన తల్లి గురించి చెబుతూ.. ఆమె తన జీవితంలో పోరాటాలు చేశారని.. దేశ పురోగతికి దోహదపడ్డారని పేర్కొన్నారు.
1949లో జన్మించిన ఇవానా మేరీ ట్రంప్ ప్రముఖ వ్యాపార వేత్తగా.. మోడల్ గా మంచి పేరుంది. ఆమెకు మొత్తం నాలుగు పెళ్లిళ్లు చేసుకోగా.. డొనాల్డ్ ట్రంప్ రెండో భర్త. 1971లో ఆల్ఫ్రెడ్ వింక్ల్ మైర్ ను పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత విడాకులు తీసుకొని ట్రంప్ ను వివాహమాడారు. వీరిద్దరి దాంపత్యం చాలాకాలమే సాగింది. వీరి అన్యోన్య దాంపత్యానికి నిదర్శనంగా ముగ్గురు పిల్లలు పుట్టారు. వారే.. డొనాల్డ్ జూనియర్.. ఇవాంకా ట్రంప్.. ఎరిక్. అయితే..వీరి వివాహ బంధం 1991లో ముగిసింది. వీరిద్దరూ విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మరో రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే.. ఈ వివాహ బంధాలు ఎక్కువ కాలం సాగలేదు.
ఇక.. ఆమె మరణం విషయానికి వస్తే.. తన ఇంట్లో మెట్ల వద్ద అపస్మారక స్థితిలో కనిపించినట్లు చెబుతున్నారు. మెట్ల మీద నుంచి కిందకు పడిపోయి ఉండొచ్చన్న వాదన వినిపిస్తోంది. పోలీసుల దర్యాప్తులో ఆమె ఎలా చనిపోయారన్న విషయం తెలుస్తుందని చెబుతున్నారు. ఆమె మరణంతో ట్రంప్ ఇంట విషాదం నెలకొంది. నిజానికి డొనాల్డ్ ట్రంప్ నకు మీడియాలో క్రేజ్ పెరగటానికి కారణం ఇవానా మేరీ కూడా కారణంగా చెబుతారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెళ్లి చేసుకొని విడిపోయిన తర్వాత.. సంబంధం లేనట్లుగా వ్యవహరించే వారికి భిన్నంగా.. తన మాజీ భార్య మరణ వార్తను షేర్ చేయటం.. ఆమెకు సంబంధించిన విషయాల్ని వెల్లడించి.. తన బాధను పంచుకునే ప్రయత్నం చేసిన ట్రంప్ తీరు చూస్తే.. ఆయన్ను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన వ్యక్తిగా కనిపిస్తారని చెప్పక తప్పదు.