అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర లేదు. తన దూకుడుతనంతో, వివాదాస్పద నిర్ణయాలతో ట్రంప్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. చైనాతో కయ్యానికి కాలుదువ్విన ట్రంప్….కరోనాను చైనీస్ వైరస్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెన్ని చెప్పినా…కరోనా ముమ్మాటికీ చైనాలోనే పుట్టిందంటూ ట్రంప్ బల్లగుద్ది మరీ చెప్పారు. ఇక, తనకు మాస్క్ అక్కర లేదన్న మాజీ పెద్దన్న ట్రంప్….కరోనా సోకిన మూడో రోజే జనాల మధ్యకు వచ్చి వివాదానికి కేంద్ర బిందువయ్యారు.
ఇలా, ట్రంప్ నకున్న విపరీతమైన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు గతంలోనే ట్రంప్ ను టాయిలెట్ పేపర్లపై ముద్రించారు కొందరు వ్యాపారవేత్తలు. ఈ కోవలోనే తాజాగా చైనాకు చెందిన ఓ వ్యాపారి బుద్ధుని రూపంలో ఉన్న ట్రంప్ విగ్రహాన్ని ఆన్ లైన్లో బేరం పెట్టాడు. ప్రశాంతంగా కూర్చొని తెలుపు రంగులో ఉన్న ట్రంప్-బుద్ధ విగ్రహాన్ని చైనా ఈ కామర్స్ సైట్ తబావోలో ఉంచారు. లాఫింగ్ బుద్ధ టైపులో…రొటీన్ కు భిన్నంగా ప్రశాంతంగా ఉన్న ట్రంప్-బుద్ధను కొనేందుకు జనం ఎగబడుతున్నారట.
ట్రంప్-బుద్ధ విగ్రహం రెండు సైజుల్లో లభిస్తుంది. 4.6మీటర్ల ఎత్తున్న భారీ విగ్రహం ధర రూ 44,707 కాగా, చిన్న సైజులో 1.6 మీటర్ల ఎత్తున్న విగ్రహం ధర రూ 11,168గా ఫిక్స్ చేశాడా వ్యాపారి. ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ నినాదం స్ఫూర్తితో తాను మేక్ యువర్ కంపెనీ గ్రేట్ ఎగైన్ అనే సందేశాన్ని ఇచ్చేందుకు ఈ విగ్రహాన్ని రూపొందించానని ఫుజియన్ ప్రావియన్స్కు చెందిన సెల్లర్ అంటున్నారు. ఇప్పటికే ట్రంప్ పై పీకల్లోతు కోపంతో ఉన్న చైనీయులు….కామెడీ కోసం ట్రంప్ విగ్రహాన్ని ఎగబడి కొంటున్నారు.
ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతూ కోపంతో ఊగిపోయే ట్రంప్….కనీసం విగ్రహంలోనైనా కుదురుగా కూర్చుండడం చూసి చైనీయులు తెగ ముచ్చటపడి ఈ విగ్రహాన్ని కొంటున్నారు. ఈ తరహాలో 100 విగ్రహాలు తయారుచేస్తే అవన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయట. ఏది ఏమైనా చైనా-అమెరికా సంబంధాలను దిగజార్చిన ట్రంప్ పై ఆ దేశవాసులు సరదా ఈ రకంగా స్వీట్ రివేంజ్ తీర్చుకుంటున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్-బుద్ధ విగ్రహం ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.