అక్టోబర్ 5న విజయదశమి సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తాను పెట్టబోతున్న జాతీయ పార్టీ గురించి కీలక ప్రకటన చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆరోజు జాతీయ పార్టీ పేరు, జెండా, ఎజెండా, విధివిధానాలను కేసీఆర్ ప్రకటిస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. అదే రోజు టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించి…ఆ భేటీలో పార్టీ నేతలందరికీ జాతీయ పార్టీ గురించి గులాబీ బాస్ వివరిస్తారని తెలుస్తోంది.
అయితే, దసరా తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక నేతలను కలిసేందుకు కేసీఆర్ దేశవ్యాప్తంగా ముమ్మరంగా పర్యటించబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ పర్యటనల కోసం ప్రత్యేకంగా ఒక చార్టెడ్ ఫ్లైట్ కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అంతేకాదు, దాదాపు 80 కోట్ల రూపాయల ఖరీదైన చార్టెడ్ ఫ్లైట్ కొనేందుకు నిధులను విరాళాల ద్వారా సేకరించాలని పార్టీ తీర్మానించింది.
12 సీట్లతో కూడిన ఈ చార్టెడ్ ఫ్లైట్ కోసం దసరా నాడే ఆర్డర్ ఇవ్వాలని కూడా పార్టీ సన్నాహాలు చేస్తోంది. అయితే, కేసీర్ ఫ్లైట్ కోసం విరాళాలు ఇచ్చేందుకు టీఆర్ఎస్ నేతలు పోటీపడుతున్నారని తెలుస్తుంది. అంతా అనుకున్నట్లు జరిగి విరాళాలు వచ్చి ఈ ఖరీదైన చార్టెడ్ ఫ్లైట్ కొంటే..సొంత విమానం కలిగిన రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ కు దేశంలోనే ప్రత్యేకమైన గుర్తింపు దక్కనుంది. కానీ, పార్టీ ఖజానాలో దాదాపు 865 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయని తెలుస్తోంది. అయినా, విమానం కొనేందుకు విరాళాలు సేకరించడం విశేషం. ఈ విషయం లీక్ కావడంతో కేజీఎఫ్ లో రాఖీ భాయ్ మాదిరి కేసీఆర్ రేంజ్ ఇది అంటూ టీఆర్ఎస్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.