కేంద్రంలోని మోడీ సర్కారుపై పోరాటంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోడీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై యుద్ధంలో కేసీఆర్ పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్లో ఏపీ విభజన అన్యాయంగా జరిగిందిన మోడీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నిరసనలు చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా మోడీపై టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ నోటీసులిచ్చారు. తెలంగాణ ఏర్పాటు అంశంలో ప్రధాని వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. సభా హక్కులు ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు టీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు అందజేశారు. ఈ విషయాన్ని గురువారం కేశవరావు రాజ్యసభలో ప్రస్తావించారు. ఆ ప్రివిలేజ్ మోషన్ నోటీసును రాజ్యసభ ఛైర్మన్ పరిశీలన కోసం పంపామని రాజ్యసభ డిప్యూటీ హరివంశ్ చెప్పారు.
187వ నిబంధన కింద టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, సంతోష్, లింగయ్య యాదవ్, సురేశ్ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో పేర్కొన్నారు. తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని నోటీసులో తెలిపారు.
పార్లమెంటులో పాస్ అయిన బిల్లును అవహేళన చేయడం సరికాదని స్పష్టం చేశారు. పార్లమెంటును, సభాపతులను అవమానపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడించారు.
పార్లమెంట్లో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ మోడీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చాలా అవమానకర రీతిలో ఏపీని విభజించారని మైకులు బంద్ చేసి పెప్పర్ స్ప్రే చల్లారని ఆయన తెలిపారు.
ఎలాంటి చర్చ జరగకుండా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా బిల్లును ఆమోదించారని పేర్కొన్నారు. అందుకే ఇప్పటికీ ఏపీ, తెలంగాణ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయన్నారు. దీనిపై టీఆర్ఎస్ మండిపడింది. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను అపహాస్యం చేసేలా ప్రధాని మాట్లాడారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేదీ లేదని గులాబీ దళం గుర్రుగా ఉంది.