భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటన పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాను ఆత్మహత్య చేసుకోవడానికి కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవ కారణమని రామకృష్ణ సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఈ క్రమంలోనే తాజాగా రాఘవను హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. రాఘవను కొత్తగూడెం తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అంతకుముందు, తనపై ఆరోపణలకు వివరణనిచ్చేందుకు రాఘవ మీడియా సమావేశం నిర్వహించాలని చూశారు. రాఘవను ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పోలీసులకు వెంకటేశ్వరరావు అప్పగించారు. ఇప్పటికే రాఘవపై పాల్వంచ పీఎస్ లో కేసు నమోదైంది. రాఘవ అరెస్ట్ నేపథ్యంలో పాల్వంచలో బంద్ కు పిలుపునిచ్చారు. రేపు భద్రాద్రి కొత్తగూడెం బంద్ నకు అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.
తన కొడుకుపై వచ్చిన ఆరోపణలపై వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య దిగ్భ్రాంతికి గురిచేసిందని, పోలీసులకు తన కొడుకుని అప్పగిస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఘవ విషయంలో నిష్పక్షపాత విచారణ కోరుతున్నానని, చట్టానికి, విచారణకు సహకరిస్తానని అన్నారు.
అన్నమాట ప్రకారమే హైదరాబాద్ లో వనమా రాఘవను పోలీసులకు అప్పగించారు. కాగా, వనమా రాఘవపై ఆరోపణలు రావడం ఇది మొదటిసారి కాదు. కొద్ది నెలల క్రితం పాల్వంచ ఎస్ఐ, మలిపెద్ది వెంకటేశ్వర్లు, తాజాగా రామకృష్ణ కుటుంబం…రాఘవ బాధితుల జాబితాలో ఉన్నాయి.