సాధారణంగా అధికార పార్టీకి చెందిన నేతలకు చాలామంది పోలీసులు ఎదురు చెప్పేందుకు సాహసించరు. మనకెందుకు వచ్చిన గొడవలే అని చిన్నా చితకా విషయాలను చాలామంది పోలీసులు పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. అయితే, అధికారం ఉందికదా అని ఎలాపడితే అలా అమర్యాదగా మాట్లాడితే మాత్రం అధికార పార్టీ నేతలపైనా పోలీసులు సీరియస్ అయిన ఘటనలున్నాయి. ఏపీలో వైసీపీ తరఫున ఎంపీ అయిన గోరంట్ల మాధవ్ కూడా గతంలో ఓ ప్రజా ప్రతినిధితో వివాదం నేపథ్యంలోనే రాజకీయాల్లోకి వచ్చారన్న సంగతి తెలిసిందే.
ఇక, ఇదే కోవలో తాజాగా తెలంగాణలో జరిగిన ఓ ఘటన ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసులపై నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నోరుజారిన ఘటన వివాదాస్పదమైంది. ‘‘నన్నే ఆపుతావారా?’’ అంటూ ఓ సీఐతో గువ్వల బాలరాజు దురుసుగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. చివరకు ఓ పోలీసు సీనియర్ అధికారి సర్ది చెప్పడంతో ఈ వ్యవహారం సద్దుమణిగింది.
మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి దశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు గువ్వల వచ్చారు. శ్రీనివాస్ గౌడ్ వ్యవసాయ క్షేత్రం సమీపంలోని ప్రధాన రహదారిపై ఎంపీ, ఎమ్మెల్యేల వాహనాల పార్కింగ్ ఉంది. కానీ, నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతంలో వాహనాన్ని ఆపని గువ్వల..నేరుగా లోపలకు వెళ్లబోయారు. ఈ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సీఐ, పోలీసులు…ఆ వాహనాన్ని అడ్డుకున్నారు.
నేరుగా లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని గువ్వలకు చెప్పారు. దీంతో ఆగ్రహించిన గువ్వల…వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ”నన్నే ఆపుతావారా?” అంటూ సీఐతో గువ్వల దురుసుగా ప్రవర్తించారు. తనను రా అనడంతో ఆగ్రహించిన సీఐ కూడా గువ్వలకు దీటుగా బదులిచ్చారు. ‘‘మీరు ఎమ్మెల్యే అయితే రా అనే అధికారం ఎవరిచ్చారు? రా అంటే మీ గౌరవం పెరగదు. మర్యాదగా మాట్లాడాలి’’ అంటూ ఘాటుగా స్పందించారు.
దీంతో, పోలీసులకు, ఎమ్మెల్యేకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ చినికి చినికి గాలివానలా మారుతుండడంతో ఓ పోలీసు సీనియర్ అధికారి జోక్యం చేసుకున్నారు. ఇద్దరినీ సముదాయించి ఎమ్మెల్యేను లోపలకు పంపడంతో వివాదం సద్దుమణిగింది. మరి, ఈ సీఐ కూడా గోరంట్ల మాధవ్ తరహాలోనే ఎంపీ అవుతారా అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.