ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించే ఎన్నికల్లో అర్హత కలిగిన వాళ్లు ఎవరైనా పోటీ చేయవచ్చు. గెలిపించాలని ప్రజలను కోరవచ్చు. కానీ చివరకు ప్రజల ఆదరణ దక్కినవాళ్లే విజేతలుగా అవుతారు. కానీ ప్రస్తుత రాజకీయాల్లో ఎన్నికల ప్రక్రియ అపహాస్యమవుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
అధికారంలో ఉన్న పార్టీలు తమ బలంతో ప్రత్యర్థి పార్టీలు ఎన్నికల్లో పాల్గొనకూడదని అన్ని ప్రయత్నాలు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం. నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులను అడ్డుకోవడం.. దొంగ ఓట్లు వేయించడం.. అధికార బలాన్ని బలగాన్ని వాడుకుని విజయాలు సాధించడం సాధారణమైపోయిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో ఇలాంటి దృశ్యాలు కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణలోనూ అదే సన్నివేశం పునరావృతం కావడం గమనార్హం. స్థానిక సంస్థల కోటా కింద 12 ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఈ సందర్భంగా రంగారెడ్డిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి భార్య, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు చింపుల శైలజను అధికార టీఆర్ఎస్ వర్గాలు అడ్డుకున్నాయి. నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆమెను అడ్డుకున్న టీఆర్ఎస్ నాయకులు ఆమె చేతిలో నుంచి నామినేషన్ పత్రాలు లాక్కొని చించేశారు. ఇలా ఒక్కసారి కాదు.. మూడు సార్లు చేశారు.
దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శైలజ చేతిలో నుంచి మరీ నామినేషన్ పత్రాలు లాక్కునేందుకు టీఆర్ఎస్ నేతలు మీద మీద పడ్డారని తెలిసింది. ఈ క్రమంలో తన కుమారుడిపై, మద్దతుదారులపై దాడి జరిగిందని సత్యనారాయాణ వాపోయారు. చివరకు పోలీసులు లాఠీఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులకు శైలజ ఫిర్యాదు చేశారు.
నామినేషన్ వేయడానికి వచ్చిన స్వతంత్ర అభ్యర్థి పట్ల టీఆర్ఎస్ నాయకులు ఇలా వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలి కానీ ఇలా ప్రత్యర్థులను అడ్డుకోవడం ఏమిటనే? ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
చేతిలో అధికారం ఉంది కదా అని ఎలా పడితే అలా వ్యవహరించడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డిలో రెండు స్థానాలకు టీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి నామినేషన్లు వేశారు.