నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టు వ్యవహారం మొదలు సుప్రీం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడం వరకు హైడ్రామా నడచిన సంగతి తెలిసిందే. రఘురామ ఎపిసోడ్ ఏపీతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తాజాగా రఘురామకు సుప్రీంలో బెయిల్ రావడం, రఘురామకు గాయాలైన విషయంపై సుప్రీంలో చర్చ జరగడం వంటి వ్యవహారాల నేపథ్యంలో జగన్ సర్కార్ తో పాటు సీఐడీ అధికారులకు ఇబ్బందులు తప్పవని ఏపీ హైకోర్టుకు చెందిన పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రఘురామను కస్టడీలో కొట్టారని తేలితే ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందలుంటాయని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి, సీఐడీ అధికారులకు ఇచ్చిన కోర్టు ధిక్కరణ నోటీసులకు గాయాల వ్యవహారం యాడ్ అవుతుందని చెబుతున్నారు. విచారణలో కొట్టినట్టు తేలితే సదురు అధికారులను తప్పకుండా పదవి నుంచి తొలగిస్తారని, శాఖాపరమైన చర్యలు, శిక్ష ఉంటుందని అంటున్నారు. ఎంపీకి కస్టడీలో అలా జరిగి ఉంటే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అని, ప్రభుత్వం కూడా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెబుతున్నారు.
అదేపార్టీకి చెందిన నేత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం తప్పేమీ కాదని, పార్టీ లోపల ప్రజాస్వామ్యం, ప్రశ్నించే హక్కు ఉండాలని చెబుతున్నారు. కాంగ్రెస్ లో గతంలో అది ఉండేదని, కానీ, కేంద్రంలో బీజేపీ, ఏపీలో వైసీపీ నియంత పోకడలు పోతున్నాయని అభిప్రాయపడుతున్నారు. వీటిలో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది లేదని దుయ్యబడుతున్నారు.
రఘురామకు ఇలా జరిగిందని కొందరు సంతోషించడం సరికాదని, రాజకీయాల్లో ఈ రోజు ఈ పార్టీలో ఉన్నవారు రేపు వేరే పార్టీలోకి వెళ్లే అవకాశముందని చెబుతున్నారు. ప్రజల తరఫున ప్రశ్నించడం తప్పు కాదని, వైసీపీ వైఖరిలో మార్పు రాకుంటే ఈ రోజు రఘురామకు జరిగింది రేపు వేరొకరికి జరగదన్న గ్యారెంటీ ఏమిటని అంటున్నారు.
వైసీపీ హయాంలో పోలీసుల దుశ్యర్య కాస్త ఎక్కువగా ఉందని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలీస్ స్టేషన్లో గుండు గీయించడం, పోలీసులను అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నేతల దాడులు, నక్సలైట్లలో చేరతానని రాష్ట్రపతికి ఓ వ్యక్తి లేఖ రాస్తే…దానికి ఆయన స్పందించి నివేదిక ఇవ్వాలని కోరడం వంటి పరిణామాలన్నీ ఏపీలో లా అండ్ ఆర్డర్ తీరును వెల్లడిస్తున్నాయని అంటున్నారు. బలహీనులను, బలవంతులను ఎవరినైనా ఏమైనా చేయగలం అని ప్రభుత్వం భావిస్తుందనేందుకు ఈ ఘటనలే నిదర్శనం అని అంటున్నారు.
ఇంటి దగ్గర నుంచి సీఐడీ మంగళగిరి కార్యాలయానికి వెళ్లేటపుడు బాగానే నడిచిన రఘురామ… ఆ తర్వాత మేజిస్ట్రేట్ దగ్గరకు తీసుకు వెళ్లేటపుడు కుంటుతూ నడవడం, గాయాలు తాజాగా ఉన్నాయని మెజిస్ట్రేట్ కూడా అభిప్రాయపడడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు. ఆస్పత్రికి తీసుకువెళ్లాలన్న మెజిస్ట్రేట్ ఆర్డర్ ను ప్రభుత్వం సవాల్ చేసిందని, దీంతో కోర్టు దిక్కరణ నోటీసులిచ్చారని చెబుతున్నారు.
ప్రభుత్వం కక్ష సాధింపునకు పోకూడదని, ఈ తరహా వ్యవహారాలలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించాలని హితవు పలుకుతున్నారు. జగన్ మీద బెయిల్ రద్దు పిటిషన్ వేయడం, క్రైస్తవులపైనా, రెడ్లపైనా రఘురామ కామెంట్లు చేయడం వంటి కారణాలతోనే పుట్టిన రోజునాడు బహుమతిలాగా రఘురామను కక్షగట్టి అరెస్టు చేశారన్న భావన కలిగిస్తున్నాయంటున్నారు.
న్యాయశాస్త్రం సత్యమేవ జయతే అన్న సూత్రాన్ని నమ్ముతుందని, సత్యం మాత్రమే గెలవాలని అన్నారు. అందరూ నిజం చెప్పాలని, ఎవరికి వారు నిజం దాచితే…ప్రజాస్వమ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు అని అంటున్నారు. రఘురామ, ప్రభుత్వం, అధికారులు నిజం చెప్పకుంటే అందరికీ ఇబ్బందులు తప్పవని అంటున్నారు.
రఘురామను పోలీసులు కొడితే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి ఉంటుందని, ప్రభుత్వానికి నిజంగా పక్షపాతం లేకుంటే…ఈపాటికి రఘురామ తనను కొట్టారని చెబుతున్న ఆ 5గురు ఎవరని విచారణ జరపడం…వారెవరో తెలిస్తే సస్సెండ్ చేయడం వంటివి చేసేదని అంటున్నారు. స్టేషన్లోకి ఎవరో అపరిచితులు రావడం సాధ్యం కాదని చెబుతున్నారు.