తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ వైఎస్ షర్మిల ఇందిరా పార్కు వద్ద దీక్ష చేసిన సంగతి తెలిసిందే. సాయంత్రం వరకు దీక్ష చేసిన ఆమె.. చివర్లో అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. తాను చేస్తున్న ఒకరోజు దీక్షను 72 గంటల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్లుగా లోటస్ పాండ్ వద్ద దీక్షా శిబిరాన్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు.
అప్పటివరకు దీక్ష అనుకున్న దానికి భిన్నంగా షర్మిల తీసుకున్న నిర్ణయాలు పోలీసులకు షాకింగ్ గా మారాయి. ఇందిరా పార్కు నుంచి లోటస్ పాండ్ వద్దకు పాదయాత్రను చేపట్టారు. దీనికి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఒక దశలో లోయర్ ట్యాంక్ బండ్ వద్దనే ఆమెను అడ్డుకొని.. పోలీసులు అదుపులోకి తీసుకుంటారని భావించారు. అందుకు భిన్నంగా ఆమె.. భారీ పరివారంతో తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఎక్కేశారు.
చూస్తుండగానే పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవటం.. వారిని కంట్రోల్ చేయటం పోలీసులకు కష్టంగా మారింది. దీనికి తోడు.. షర్మిల చుట్టూ ఉన్న వారిని దాటి.. ఆమె వద్దకు పోలీసులు చేరుకోవటానికి కష్టసాధ్యమైంది. వడివడిగా అడుగులు వేసిన ఆమె.. తెలుగుతల్లి ఫ్లైఓవర్ మధ్యకు చేరుకునేసరికి మాత్రం.. పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను.. అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ క్రమంలో షర్మిల అనూహ్యంగా స్పృహ తప్పి పడిపోయారు. కాసేపటికే తేరుకున్న షర్మిలను అరెస్ట్ చేసి బేగంపేట మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. దీక్ష ముగింపు సందర్భంగా చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో పోలీసులు షాక్ తిన్నారు. మరోవైపు, షర్మిల స్పృహ తప్పి పడిపోవడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
ఉదయం 10 గంటలకు దీక్ష మొదలు పెట్టి సాయంత్రం 5 గంటలకు ముగిస్తే… స్పృహ తప్పి పడిపోవడం ఏమిటని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. షర్మిల పడిపోవడం….ఆ వెంటనే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ లు, స్క్రోలింగ్ లు రావడంపై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. షర్మిల సోయ తప్పి పడిపోయారని చెబుతోన్న మీడియాకు సోయలేదని, కేవలం 7 గంటలపాటు దీక్ష చేస్తేనే సోయలేకుండా పడిపోవడం ఏమిటని నెటిజన్లు వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.