వై నాట్ 175? అంటూ ఆత్మవిశ్వాసంతో మరోసారి ఎన్నికల రణంలోకి దూసుకెళ్లేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ కు ఎదురుదెబ్బలు భారీగానే తగిలేట్లు కనిపిస్తున్నాయి. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసిన జగన్.. ‘‘వై ఏపీ నీడ్స్ జగన్’’ అంటూ కార్యక్రమాన్ని తలపెట్టారు. దీనికి కౌంటర్ గా మళ్లీ మీరెందుకు జగన్? అంటూ ఎదురు ప్రశ్నలతో జగన్ పాలనా వైఫల్యాల్ని ప్రశ్నించే గళం ఒకటి బలంగా బయటకు వస్తోంది.
గడిచిన నాలుగున్నరేళ్లుగా ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంతో పాటు.. ఆయన అనుచర మంత్రులు.. పార్టీ నేతలు చేసిన పనులపైనా పెద్ద కౌంటర్ ను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో జగన్ ఇచ్చిన హామీలు.. ఇంకా నెరవేర్చని వాటితో తయారు చేసిన జాబితాతో.. మళ్లీ జగన్ ఎందుకు? అన్న సూటి ప్రశ్నతో ప్రచారాన్ని షురూ చేవారు.
ఆ ప్రశ్నలివే..
అధికారంలోకి వచ్చిన వారానికే సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను నమ్మించి.. నాలుగేళ్ల తర్వాత జీపీఎస్ అంటూ మాట మార్చినుందుకు మళ్లీ జగన్ రావాలా?
మధ్యంతర భృతి కంటే ఫిట్ మెంట్ ను తగ్గించి అత్తెసరు పీఆర్సీని ప్రభుత్వ ఉద్యోగులకు కానుకగా ఇచ్చినందుకా?
2.6 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పి చేయనందుకా?
వేర్వేరు వాదనలతో.. విధానాలతో పాఠశాల విద్యను గందరగోళంలోకి నెట్టినందుకా?
2021 జూన్ నాటికే పోలవరం నుంచి నీళ్లు ఇస్తామని ఒకసారి 2022 ఖరీఫ్ నాటికి అంటూ మరోసారి మాట ఇచ్చి తప్పినందుకు మళ్లీ జగన్ ను ఎన్నుకోవాలా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీని అప్పుల కుప్పగా మార్చారని.. రూ.10 లక్షల కోట్లకు పైగా రుణ భారాన్ని మోపారని.. రూ.వేల కోట్ల బిల్లులు బకాయిలుగా పెట్టి ఏపీ అంటేనే కాంట్రాక్టర్లు ముఖం చాటేసేలా చేసినందుకు మరోసారి ముఖ్యమంత్రిని చేయాలా? అని ప్రశ్నిస్తున్నారు.
అప్పు తెస్తే కానీ.. ఉద్యోగుల జీతాలు.. రిటైర్డ్ ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వలేని దుస్థితికి ఏపీ ఆర్థిక పరిస్థితిని మార్చినందుకా? ఒకటో తేదీకి జీతాలు వస్తే అదే గొప్ప అనే స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లినందుకా? పీఆర్సీ.. డీఏ బకాయిల్ని నాలుగేళ్లలో విడతల వారీగా చెల్లిస్తామని చెప్పి వచ్చే ప్రభుత్వంపై భారాన్ని మోపుతున్నందుకా? ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి.. కొద్దిమందికి మాత్రమే అమలు చేసినందుకా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో రూ.50వేలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి.. ఏటా రూ.7500 మాత్రమే ఇస్తున్నందుకు మరోసారి జగన్ కు ప్రభుత్వ పగ్గాలు అందించాలా? అని ప్రశ్నిస్తున్నారు. దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే మద్యం అమ్ముతూ.. వ్యాపారాన్ని తన వారికే అప్పగించినందుకా? లిస్టు అయిన 100 కంపెనీలు కాదని.. సర్కారు సన్నిహితుల నుంచి మద్యాన్ని కొనిపిస్తున్నందుకా? రాష్ట్రంలో లాభసాటి గనుల్ని అధికారికంగా.. అనధికారికంగా ప్రభుత్వ పెద్దల చేతుల్లో పెట్టేసినందుకా? పంచాయతీలకు కేంద్ర ఆర్థిక సంఘం పంపిన రూ.1500 కోట్లను విద్యుత్ బిల్లుల బకాయిల్ని మళ్లించినందుకా? అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో ఇప్పటికి మూడుసార్లు ఆర్టీసీ చార్జీలను పెంచేసిందుకు మళ్లీ అధికారాన్నిఇవ్వాలా? అంటూ మరింత పెద్ద జాబితాను వినిపిస్తున్నారు. మరి.. ఈ కౌంటర్ ప్రశ్నలకు సమాధానాలేమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.