ఏపీలో మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజున కక్షపూరితంగానే ట్రస్టు చైర్మన్ పదవి నుంచి తొలగించి..ఆ స్థానంలో సంచయిత గజపతి రాజును కూర్చోబెట్టారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయితే, ఈ వ్యవహారంలో తాజాగా అశోక్ గజపతి రాజుకు అనుకూలంగా హైకోర్టు తీర్పునివ్వడం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు.
దీంతో, సంచయిత మహిళ అని….ఆమెపై వివక్షాపూరితంగా అశోక్ గజపతి రాజు వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సంచయితకు మహిళాలోకం అండగా ఉంటుందని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. సంచయితకు పద్మ మద్దతు తెలపడం అభినందనీయమని, కానీ, మాన్సాస్ అనేది ఒక ట్రస్ట్ అని దానికి కొన్ని నియమ నిబంధనలు ఉటాయన్న సంగతి పద్మ తెలుసుకోవాలని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
మాన్సాస్ ట్రస్టు ప్రభుత్వం దాన ధర్మాల మీద, దయాదాక్షిణ్యాల మీద ఆధారపడలేదని, అది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ కాదని గుర్తు పెట్టుకోవాలంటున్నారు. ఆ ట్రస్ట్ పదవి వ్యవహారాన్ని సంచయిత కోర్టులో తేల్చుకోవచ్చని, ఇలా అన్యాయం జరిగిందని వైసీపీ భావిస్తే సంచయితకు ప్రభుత్వ నామినేటెడ్ పోస్టు ఇవ్వాల్సిందిగా జగన్ రెడ్డిని డిమాండ్ చెయ్యమని పద్మకు సలహాలిస్తున్నారు. అదీ కాకుంటే సంచయితను ఎమ్మెల్సీ చేసి డిప్యూటీ సీఎం చేయొచ్చని, కుదరకపోతే కుల కార్పొరేషన్ చైర్మన్ లేదంటే టీటీడీ చైర్మన్ చెయ్యాలంటూ సెటైర్లు వేస్తున్నారు.
జగన్ రెడ్డి ఇంటికి కిలోమీటరున్నర దూరంలో రేప్ జరిగిందని, అలా లైంగిక వేధింపులకు గురైన వారిని పద్మగారు ఆదుకోవాలని అంటున్నారు. అలా కాకుండా, కోర్టు తీర్పు అశోక్ గజపతిరాజుకు అనుకూలంగా వచ్చిందన్న కారణంతో సంబరాలు చేసుకుంటున్న టీడీపీ మీద అసూయపడవద్దని, తెలుగు సీరియల్స్ లో అసూయతో రగిలిపోయినట్టు రగిలిపోతే ప్రయోజనం లేదని చురకలంటిస్తున్నారు. కోర్టుల్లో గెలిచి వైసీపీ సంబరాలు చేసుకుంటే ఓటేసిన ప్రజానీకం గర్విస్తుందని, అది చూసి ఆనందించాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.