తిరుమల నడక దారిలో ఇటీవల ఒక చిన్నారి పాప మీద చిరుత పులి దాడి చేసి చంపేసిన ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. రాజకీయంగా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశం అయింది. భక్తుల రక్షణను గాలికి వదిలేశారంటూ టీటీడీ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి.
పాపను చంపిన చిరుత పులిని బంధించినప్పటికీ.. ఇంకా రెండు పులులు నడక దారికి సమీపంలో తిరుగుతున్నాయన్న సమాచారం బయటికి రావడంతో భక్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ భయాలను తొలగించి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది. మళ్లీ ఇలాంటి విషాదాలు చోటు చేసుకోకుండా ఏం చర్యలు చేపడతారో చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సమస్య పరిష్కారానికి సూచించిన పరిష్కారం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
కాలి నడకన వెళ్లే భక్తులు ప్రతి ఒక్కరికీ ఒక కర్ర ఇస్తాం అని చెప్పి ఆయన మానవ జాతి పరిణామలో కర్రకు ఉన్న ప్రాధాన్యం గురించి లెక్చర్ ఇచ్చారు. ఈ వీడియో నిన్నట్నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పులుల నుంచి కాపాడుకోవడానికి కర్ర ఇవ్వడం పరిష్కారమా అంటూ దీని మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది సోషల్ మీడియాలో. ఇష్యూ చాలా సీరియస్ అయినప్పటికీ.. టీటీడీ ఛైర్మన్ చెప్పిన పరిష్కారం కామెడీగా ఉండటంతో నెటిజన్లు కూడా అంతే కామెడీగా స్పందిస్తున్నారు. దీని మీద కుప్పలు కుప్పలుగా మీమ్స్ వచ్చి పడుతున్నాయి.
ఒకవేళ టీటీడీ భక్తులకు కర్రలు ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు. ఆ పనిని సైలెంటుగా చేయాల్సింది. అంతే తప్ప అదొక గొప్ప పరిష్కారం అన్నట్లు ప్రెస్ మీట్లలో ఘనంగా ప్రకటనలు చేయడంతో వచ్చింది సమస్య. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో జరిగిన అనేక పరిణామాలు, నిర్వహణ లోపాలతో ఇప్పటికే భక్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తాజా విషాదం వారిలో ఆగ్రహాన్ని ఇంకా పెంచింది. ఇలాంటి టైంలో భూమన మాటలు టీటీడీ మీద, వైసీపీ మీద వ్యతిరేకతను ఇంకా పెంచేలాగే ఉన్నాయి.