ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు….ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చేవరకు నిద్రపోమంటూ వైసీపీ నేతలు ప్రగల్భాలు పలికిన సంగతి తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేవరకు పోరాడుతూనే ఉంటామని, కేంద్రం మెడలు వంచైనా హోదా తీసుకువస్తామని ఏపీ సీఎం జగన్ కూడా ఎన్నికలకు ముందు గట్టిగానే చెప్పారు. ఈ క్రమంలోనే సీఎం జగన్…ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ…ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తుతుంటారని వైసీపీ నేతలు చెబుతున్నారు. తాజాగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కూడా ప్రత్యేక హోదాపై పోరాడతామని వైసీపీ ఎంపీలు చెప్పారు. ఈ క్రమంలోనే ఎలాగైతేనేం ఏపీకి ‘Special Status’ వచ్చేసింది. అయితే, ఏపీకి ‘Special Status’ అనగానే ఏపీకి ప్రత్యేక హోదా వచ్చిందని ట్రూ ట్రాన్స్ లేషన్ చేస్తే మాత్రం మీరు ముద్దపప్పులో కాలేసినట్టే. ఇప్పటిదాకా ఉపోద్ఘాతమిచ్చింది ఏపీకి తాజాగా వచ్చిన ‘Special Status’ లిక్కర్ బాటిల్ గురించి అన్నమాట. ఈ లిక్కర్ బాటిల్ పుణ్యమా అంటూ అసలు సిసలు స్పెషల్ స్టేటస్ ను మరోసారి జనాలు గుర్తు చేసుకుంటున్నారు.
ఏపీకి ‘స్పెషల్ స్టేటస్’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్స్, ట్రోలింగ్ జరుగుతోంది. స్పెషల్ స్టేటస్ పేరుతో వచ్చిన కొత్త లిక్కర్ బాటిల్ పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ క్వార్టర్ బాటిల్ పై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఆఖరికి ఈరకంగా స్పెషల్ స్టేటస్ తెచ్చారా జగన్ మోహన్ రెడ్డి గారూ అంటూ టీడీపీ నేత, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ట్విట్టర్ లో సెటైర్ వేశారు. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ వచ్చిందని, జగన్ ఎట్టకేలకు అనుకున్నది సాధించారని టీడీపీ కార్యకర్తలు, జనసైనికులు ట్రోల్స్ చేస్తున్నారు. ఈ రకంగా ఏపీకి స్పెషల్ స్టేటస్ తెచ్చారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏపీకి ‘Special Status’ వచ్చిందని, తనకు ‘polavaram’ కావాలని ఓ నెటిజన్ వేసిన సెటైర్ వైరల్ అవుతోంది. మరి, ఈ ట్రోలింగ్ చూసైనా ఏపీకి ప్రత్యేక హోదాపై వైసీపీ నేతలు చిత్తశుద్ధితో వ్యవహరిస్తారేమోనని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.