వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవితో పాటు, పార్టీ సభ్యత్వానికి కూడా వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడం తెలిసిందే. అయితే, ఆమె రాజీనామా వ్యవహారం ముందుగా అనుకున్న విధంగానే జరిగింది కాబట్టి పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. కానీ, ఆమె రాజీనామా గురించి వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లు మాత్రం తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. విజయమ్మ పక్కాగా జగన్ రాసిన స్క్రిప్ట్ ను చూసి మరీ పొల్లు పోకుండా చదివారని కామెంట్లు వస్తున్నాయి.
విజయమ్మతో జగన్ బలవంతంగా రాజీనామా చేయించారని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అయితే, అదేం లేదు…ఆమె వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారంటూ వైసీపీ నేతలు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయమ్మ రాజీనామాపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. విజయమ్మ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని, ఓ వర్గం మీడియా రాజీనామాను రాజకీయం చేస్తోందని చెప్పారు. వైసీపీని విమర్శించడానికి ఏమీ లేక… విజయమ్మ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని అన్నారు.
దీంతో, సజ్జల వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. చిన్న పిల్లలు పుస్తకం చూసి చదివినట్లు విజయమ్మ జగన్ రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారని, ఇంకా వక్రీకరించేదేమిటని నెటిజన్లు ఆడుకుంటున్నారు. విజయమ్మ సేవలను జగన్ వాడుకుని సీఎం అయ్యారని, ఇపుడు అవసరం తీరిపోయాక పార్టీ నుంచి తరిమేశారని అంటున్నారు. కుటుంబంలో విభేదాలు కారణం కాకపోతే జగన్, షర్మిలలు ఎడమొహం పెడమొహంగా ఎందుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు.
పోనీ, విజయమ్మ ఉన్న పళంగా రాజీనామా ఎందుకు చేశారో సజ్జల చెప్పాలని అంటున్నారు. ఇక, విజయమ్మ వ్యాఖ్యలకు అసలు అర్థం ఏమిటో సజ్జలే చెప్పాలని ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా…విజయమ్మ రాజీనామా జగన్ కు చిక్కులు తెచ్చపెట్టిందని అంటున్నారు.
Comments 1