ముద్రగడ పద్మనాభం… కాపు ఉద్యమ నాయకుడిగా, కేంద్ర మాజీ మంత్రిగా తెలుగు ప్రజలకు సుపరిచితుడు. ఈ నెల 14న ఆయన వైసీపీలో చేరనున్న విషయం తెలిసిందే. ఎలాంటి షరతులు లేకుండా ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు, తన అబిమానులకు లేఖ రాశారు. తాను వైసీపీలో చేరుతున్నట్టు తెలిపారు. ఈ నెల 14న సీఎం జగన్ పిలుపు మేరకు తాను వైసీపీ తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు.
తాను 14వ తేదీన కిర్లంపూడిలోని తన నివాసం నుంచి బయలు దేరి ప్రత్తిపాడు-జగ్గంపేట-లాలా చెరువు-వే మగిరి-తణుకు-తాడేపల్లిగూడెం-ఏలూరు-విజయవాడల మీదుగా తాడేపల్లికి చేరుకుని సీఎంజగన్ సమక్షం లో పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. అయితే..తాను ఎలాంటి తప్పుడు పనిచేయలేదని.. చేయబోనని కూడా ఆయన వెల్లడించడం గమనార్హం. తనను ప్రజలు ఆశీర్వదించాలని.. మీ బిడ్డగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు.
ఇక, తనతోపాటు వచ్చేవారిని కూడా ముద్రగడ ఆహ్వానించారు. వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో తనతో కలిసి వచ్చేవారిని కూడా ఆయన రావాలని పిలుపునిచ్చారు. అయితే.. ఎవరి ఆహారం, నీళ్లు, ఇతర అవసరా లను వారే చూసుకోవాలని చెప్పడం గమనార్హం. అంటే.. ఎవరికీ ఎలాంటి ఖర్చు తను పెట్టేది లేదని ముద్ర గడ స్పష్టం చేశారు. ప్రస్తుతం పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు నిరాఘాటంగా అందించాలంటే.. జగన్ మరోసారి సీఎం అవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే వైసీపీ బాట పట్టానని చెప్పారు.
ఈ క్రమంలోనే ముద్రగడపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. వైసీపీలో బానిసగా చేరి 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి అవుతావా అంటూ ముద్రగడపై విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ముద్రగడ తన నోటితో…వైసీపీలో తప్ప మరే పార్టీలో అయినా చేరతాను అని స్వయంగా చెప్పారని ప్రచారం జరిగింది. అటువంటి ముద్రగడ అదే నోటితో పేదలకు సంక్షేమ పథకాలు ఆగకుండా ఉండాలంటే జగన్ మరోసారి సీఎం కావాలి అంటూ తాజాగా ప్లేటు ఫిరాయించడం వెనుక స్వలాభం ఏంటో ప్రజలకు అర్థం అయిందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్ కోసం కాపు జాతిని జగన్ కు తాకట్టు పెట్టారని ముద్రగడపై విమర్శలు గుప్పిస్తున్నారు.