ఏపీలో కొన్ని రోజులుగా వలంటీర్ల విషయంలో రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. వారాహియాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వలంటీర్లపై విమర్శలు చేసిన తర్వాత.. వైసీపీ నాయకులు, ముఖ్యంగా మంత్రులు రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో తాజాగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తణుకు నాయకుడు, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఒక్క వలంటీర్‌ను అరెస్టు చేసినా.. తాను తణుకు నాలుగు రోడ్ల జంక్షన్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. అంతేకాదు.. తన నియోజకవర్గంలో ఒక్క బెల్టు షాపు ఉన్నా.. తాను పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
అయితే.. మంత్రి కారుమూరి చేసిన ప్రకటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తిగా స్పందించారు. వలంటీర్లపై చేసిన విమర్శల కే.. మంత్రిగారు ఉరేసుకుంటానని అంటున్నారని.. మరి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై ఎందుకు ఇన్నాళ్లు మౌనంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, సొంత జిల్లాలోని(పశ్చిమ) పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకుండా.. నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్న ప్రభుత్వంపై కోపం లేదా? దీనికోసం ఉరేసుకుంటానని అంటే.. స్వాగతిస్తారని హాట్ కామెంట్లు చేశారు. కేంద్రం నుంచి తీసుకురావాల్సిన విభజన నిధులు తీసుకురాలేదని.. దీనికి మాత్రం మంత్రి స్పందించడం లేదని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా తెస్తానన్న పార్టీలోఉన్న మంత్రి వర్యులు.. ఈ హోదా కోసం ఉరేసుకుంటానని అంటే.. బాగుండేదని మరికొందరు వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని పప్రైవేటు పరం చేస్తామని కేంద్రం చెప్పినప్పుడు.. ఇదే పశ్చిమ గోదావరిజిల్లాలోని ఆక్వా పరిశ్రమతో ఇబ్బందులు పడుతున్న రైతాంగానికి అండగా ఉండేందుకు.. వారి సమస్యల కోసం.. నిరసనగా ఉరేసుకుంటానని ఎందుకు అనరని ప్రశ్నిస్తున్నారు. పోనీ.. వలంటీర్ వ్యవస్థలోని లోపాలను అడ్డుకునేందుకు ఏమైనా ప్రయత్నించారా? అని కూడా నిలదీశారు. చిన్న విషయాన్ని పెద్దది చేయడం.. వార్తల్లో నిలవాలనే కుతూహలంతో ఉరేసుకుంటానని వ్యాఖ్యలు చేయడం ఎందుకని మరికొందరు ప్రశ్నించారు.