ఊరకరారు మహానుభావులు అన్నట్టుగా.. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఏం చేసినా.. ఊరికేనే చేయదు. ఎంతో కొంత కూడా కాదు.. భారీ లాభమే చూసుకుని ముందుకు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఎక్కడ ఎలాంటి అవకాశం చిక్కినా.. వెంటనే దానిని తమకు అనుకూలంగా మార్చుకుని ముందుకు నడుస్తోంది. తాజాగా ఇప్పుడు ఇంటింటికీ స్టిక్కర్ పథకాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు.
అయితే.. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ ఫొటోతో ఇంటింటికీ స్టిక్కర్లు అతికించడంపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు నిప్పులు చెరిగారు. ఈ స్టిక్కర్లకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందా? తమ పార్టీ భరిస్తోందా? వెల్లడించాలని ప్రశ్నించారు. ‘ఒక స్టిక్కర్‌కు రూ.30 చొప్పున వేసుకున్నా కోటి స్టిక్కర్లకు రూ.30 కోట్లు అవుతుంది“ అని లెక్కలు కూడా చెప్పారు.
ప్రభుత్వ నిధులతో అతికిస్తే వాటిలో ఫ్యాన్ గుర్తు లేకుండా చూసుకోవాలన్న ఆర్ ఆర్ ఆర్.. ఒకవేళ పార్టీ నిధులను వెచ్చిస్తే ఇష్టం ఉన్నవారి ఇంటికి మాత్రమే అతికించాలన్నారు. వలంటీర్లు బలవంతంగా స్టిక్కర్లను అతికిస్తే… ప్రజలు వీడియో తీసి ఎన్నికల కమిషన్‌కు నివేదించొచ్చునని సలహా కూడా ఇచ్చారు. ప్రత్యేక హోదా తీసుకొస్తామని పదేపదే చెప్పిన సీఎం జగన్ ఇప్పుడు ఏంచేయలేక… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సరే.. రఘురామకు అంటే.. అక్కసు ఉంది.. కాబట్టి స్టిక్కర్లను కూడా రాజకీయం చేస్తున్నారని.. సీఎం జగన్ ను తిట్టిపోస్తున్నారని అనుకుందాం.. కానీ, తటస్థంగా ఉండే.. చాలా మంది నాయకులు.. మాజీ నాయకులు.. ఐఏఎస్ అదికారులు కూడా దీనిని తప్పుబడుతున్నారు. ఇంటింటికీ స్టిక్కర్ అనే పథకం దేశంలో ఎక్కడా లేదని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని చెబుతున్నారు. మరి దీనిపై జగన్ వెనక్కితగ్గుతారో.. లేక ఏం చేస్తారో చూడాలి.