అందుకే అంటారు.. ఒకటి అంటే రెండు అనిపించుకోవాల్సి వస్తుందని. తాజాగా అలాంటి ఘోరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు వైసీపీకి చెందిన నేతలు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యాక్టివిస్టులు. రాజకీయాల్లో ఉండే సహజ మర్యాదల్ని మట్టిలో కప్పేసి.. కొత్త తరహాలో కెలికే కల్చర్ కు తెర తీసి.. సోషల్ మీడియాను ఆయుధంగా చెసుకొని చెలరేగిపోయే రోజులు వచ్చేయటం తెలిసిందే.
యువగళం పేరుతో టీడీపీ కీలక నేత నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో.. అందులో పాల్గొనేందుకు తారకరత్న రావటం.. తీవ్రమైన గుండెపోటుకు గురై.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అతడి పరిస్థితి విషమంగా ఉన్న వేళ.. వైసీపీకి చెందిన మంత్రులు.. నేతలు మొదలు.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారంతా లోకేశ్ లెగ్ మహిమ అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడేసిన తీరు తెలిసిందే.
తమ యువనేతను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలకు సరైన రీతిలో రిటార్టు ఇవ్వాలని.. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న టీడీపీ వర్గాలకు.. తాజాగా చోటు చేసుకున్న పరిణామం కలిసి వచ్చిందంటున్నారు. నిన్న విమానంలో ఢిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జర్నీ అర్దాంతరంగా ఆగిపోవటం… అత్యవసర ల్యాండింగ్ చేసి.. ఆయన్ను తాడేపల్లిలోని ఇంటికి పంపించేయటం తెలిసిందే.
ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. వైసీపీ నేతలు అన్నట్లే తమ లోకేశ్ బాబు లెగ్ పవర్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో ఇప్పటికైనా అర్థమైందా? అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. తమ యువనేత పాదయాత్ర చేయటం మొదలు పెట్టినంతనే.. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానానికి సాంకేతిక లోపం రావటం ఏమిటి? అత్యవసర ల్యాండింగ్ చేయటం ఏమిటి?అని ప్రశ్నిస్తున్నారు. లోకేశ్ పాదయాత్ర ఎపెక్టుతో.. ఆయన లెగ్ మహిమతో ముఖ్యమంత్రి ఇబ్బందులు గురి కావాల్సి వస్తోందన్న వాదనను వినిపిస్తున్నారు. ఏమైనా..ఈ తరహా ప్రచారాల్ని ఆపాల్సిన అవసరం ఉంది. అయితే.. ఈ విషయంలో మాత్రం అధికార వైసీపీ కాస్తంత ఆచితూచి మాట్లాడితే.. ఇలాంటి పంచ్ లు ఉండవనే మాట వినిపిస్తోంది.