తాము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నభూతో న భవిష్యత్ అని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ గొప్పలు చెప్పుకుంటోన్న సంగతి తెలిసిందే. ఆరు నూరైనా…నూరు నూట యాబై అయినా…కరోనా వచ్చినా…కరీనా వచ్చినా….ఏపీ అప్పుల సునామీలో కొట్టుకుపోయినా సరే…సంక్షేమ పథకాలు మాత్రం ఆగవని, ఆ పథకాల అమలుకు కుప్పలుతెప్పలుగా అప్పులు చేస్తామని జగన్, ఆర్థిక మంత్రి బుగ్గన బల్లగుద్ది మరీ చెబుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తమ పథకాల గురించి తామే డప్పు కొట్టుకుంటే విమర్శలు వస్తున్నాయని భావించారో ఏమో తెలీదుగానీ…తాజాగా లబ్ధిదారులకు ట్రైనింగ్ ఇచ్చి మరీ కొన్ని ఆణిముత్యాలను జనం మీదకు వదులుతున్నారు వైసీపీ నేతలు. ఇటీవల జగనన్న విద్యా దీవెన పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ఓ విద్యార్థి మాట్లాడిన ఓ ఆణిముత్యం వంటి డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దానిపై నెటిజన్లు ట్రోలింగ్ మొదలుబెట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఓ విద్యార్థి మాట్లాడుతూ ‘‘డాక్టర్ వైఎస్ఆర్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమాల ద్వారా పేద విద్యార్థులకు గొప్ప చదువులు చదువుకునే అవకాశం కల్పించారు. తండ్రి బాటలోనే తనయుడు పయనిస్తున్నారు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. మీరు ప్రవేశపెట్టిన పథకాల వల్ల నేను చదువుకోగలిగాను.. ఇప్పుడు నాలుగు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సాధించాను. అందులో నేను ఇన్ఫోసిస్‌ను ఎంచుకున్నాను” అంటూ జగన్ మామను ఆకాశానికెత్తేశాడు.
దీంతో, ఆ విద్యార్థి మాటపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. జగనన్న విద్యా దీవెనలో ఇది టాప్ కామెడీ స్కిట్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. జగన్ సీఎం అయిన రెండేళ్లలో రెండుసార్లు నిధులు విడుదల చేశారని, దానికితోడు కరోనా కాలంలో పరీక్షలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న తరుణంలో ఈ విద్యార్థి అలా ఎలా చేయగలిగాడంలూ ఆశ్చర్యపోతున్నారు.
మరోవైపు, కరోనా కాటుతో సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం కకావికలమై కొత్త నియామకాలు దాదాపుగా ఆపేసిన తరుణంలో ఒకేసారి నాలుగు సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదించడం మామూలు విషయం కాదంటూ ట్రోల్ చేస్తున్నారు. వైన్ షాపుల నుంచి వలంటీర్ల ఉద్యోగాల వరకు…చాలామంది ఈ విద్యార్థిని చూసి అసూయపడకండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. చివరగా..జగన్ జమానాలో గుర్రం ఎగరా వచ్చు…ఇలా ఒకటికి నాలుగు ఉద్యోగాలు రానూ వచ్చూ అంటూ సెటైర్లు వేస్తున్నారు.