కులం చూడం…మతం చూడం…పార్టీ చూడం…నేను అధికారంలోకి వస్తే సామాజిక న్యాయం అంటే ఏంటో చూపిస్తా…అంటూ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మైకులు అరిగిపోయేలా చెప్పిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే…సీఎం జగన్ గా మారిన ప్రతిపక్ష నేత జగన్…తన అసలు రంగు బయటపెట్టుకుంటున్నారు. జగన్ హయాంలో ఏపీలో క్రిస్టియానిటీ పెరుగుతోందన్న ఆరోపణలకు తగ్గట్లుగానే జగన్ చేసే పనులూ ఉంటున్నాయి.
కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు పెద్దపీట వేశారని ఆరోపణలు గుప్పించిన జగన్…తన రెడ్డి సామాజిక వర్గానికి అంతకన్నా పెద్దపీట వేస్తూ విమర్శల పాలవుతున్నారు. గతంలో క్రైస్తవ సోదరులకు సాంత్వన చేకూర్చేందుకు ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని అర్ధాంతరంగా పదవి నుంచి బదిలీ చేశారని ఆనాడు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, ఎల్వీని అవమానకర రీతిలో తొలగించడానికి క్రైస్తవ ప్రార్థనలే కారణమని క్రైస్తవ మత పెద్ద గతంలో వ్యాఖ్యానించడం, ఎల్వీ తొలగింపును సెలబ్రేట్ చేసుకుంటూ కేక్ కటింగ్ చేయడం గతంలో వైరల్ అయింది.
ఇక తాజాగా, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రవీణ్ ప్రకాష్ లను తొలగించిన జగన్….వారి స్థానంలో తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకొని మరోసారి విమర్శల పాలయ్యారు. ఇప్పటికే తొలివిడతలో 1111 పదవులు రెడ్లకి ఇవ్వటంతో పాటు, మలి విడతలో కూడా ప్రకాష్,సవాంగ్ ల స్థానంలో రెడ్లను నియమించుకున్నారని రెడ్డి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటనలు గుప్పించడం విశేషం.
సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ను ఢిల్లీలో ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేసిన జగన్…ఆయన స్థానంలో ధనుంజయ రెడ్డిని నియమించారు. ఇక, డీజీపీ సవాంగ్ కు పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించిన జగన్…ప్రవీణ్ కు బదులు తన సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించుకున్నారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. వారిద్దరిదీ ఏ సామాజిక వర్గం…అంటూ జగన్ పై పంచ్ లు పడుతున్నాయి. సీనియారిటీలో ద్వారకా తిరుమలరావు ముందున్నప్పటికీ రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా జగన్ నియమించడం ఆయన కులాభిమానానికి పరాకాష్ట అని విమర్శలు వస్తున్నాయి.