చిన్నపిల్లాడికి తెలిసిన విషయాలు కూడా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలీవా? రోజువారీ తినే తిండిలో వాడే అతి సామాన్యమైన వస్తువుల వివరాలు కూడా తెలీనితనం చూసినప్పుడు మరీ.. ఇంతనా? అనుకోకుండా ఉండలేం. ఉల్లిగడ్డకు బంగాళదుంపకు తేడా తెలీ కపోవటం ఒక ఎత్తు అయితే.. బంగాళదుంప పదాన్ని పలకటానికి పడిన ఇబ్బంది చూసినప్పుడు ఏపీ ముఖ్యమంత్రి వారికున్న అవగాహనను జీర్ణించుకోవటం కష్టమే.
మిగ్ జాం తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాలు తీవ్ర ప్రభావానికి గురికావటం.. దీని కారణంగా వేలాది మంది తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న వేళ.. ఆయా ప్రాంతాల్లోని బాధిత ప్రజల్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ప్రసంగించిన జగన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నాయి. తిరుపతి జిల్లాలో పర్యటించిన సందర్భంగా తుపాను బాధితులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో ఆయన నోటి నుంచి మాటలు షాకింగ్ గా మారాయి.
తుపాను బాధితులకు ప్రభుత్వం నుంచి అందే సాయం గురించి చెప్పే ప్రయత్నంలో ఆయన ఏ మాత్రం ప్రిపేర్ కాలేదని.. అధికారుల నుంచి బ్రీఫ్ తీసుకోలేదన్న విషయం కొట్టొచ్చినట్లుగా తెలుస్తుంది. విపత్తులు విరుచుకుపడిన వేళలో బాధిత ప్రజానీకానికి ఇచ్చే వస్తువుల్లో బియ్యం.. కందిపప్పు.. చింతపండు.. కారం.. నూనె.. ఉల్లిపాయలు.. బంగాళదుంపలు ఇవ్వటం చూస్తుంటాం. కొన్ని సందర్భాల్లో పంచదార ఇవ్వటం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే సాయంలో ఇవి తప్పనిసరిగా ఉంటాయి. వీటితో.. రోజువారీ ఆహారాన్ని తాత్కాలికంగా ఎవరి మీదా ఆధారపడకుండా వండుకోవటానికి ఉపయోగపడుతుంది.
ఇంత చిన్న అంశాన్ని సభికులకు చెప్పేందుకు సీఎం జగన్ పడిన అవస్థ అంతా ఇంతా కాదు. బాధితులకు ఇచ్చే వస్తువుల వివరాల్ని ఒక్కొక్కటిగా కనుక్కొంటూ.. అధికారులు చెప్పే వస్తువుల పేర్లను చెప్పటం.. మధ్యలో ఉల్లిపాయల్ని పేర్కొన్న తర్వాత.. అధికారులు పొటాటో అంటే.. ఉల్లిపాయలే కదా? అనటం.. కాదంటూ బంగాళదుంపలు అని చెప్పటంతో.. బంగాళ.. అంటూ ఆ పదాన్ని పలికేందుకు పడిన అవస్థ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పొటాటో అంటే బంగాళదుంపే కానీ ఉల్లిపాయ కాదన్న కనీస విషయం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారికి తెలీకపోవటం ఇప్పుడు షాకింగ్ గా మారింది. బాధిత ప్రజానీకాన్ని ఓదార్చేందుకు వచ్చే వేళ.. కనీస సమాచారాన్ని తెలుసుకొని వస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.