చెల్లికి పెళ్లి.. జరగాలి మళ్లీ మళ్లీ.. అన్న డైలాగు గుర్తుందికదా!! అచ్చం అదే సీన్… కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో తెరమీదికి వచ్చింది. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఎప్పుడు కడతారో.. తెలియదు కానీ.. భూమి పూజలు మాత్రం నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి. అందుకే.. నెటిజన్లు.. `మళ్లీ మళ్లీ చెల్లికి పెళ్లి` అన్నట్టుగా ఉందని నవ్విపోతున్నారు. మరి ఈ కథేంటో చూద్దామా..
2007-08 మధ్య.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరెడ్డి కడపలో ఉక్కు ఫ్యాక్టరీకి శంకు స్థాపన చేశారు. గనుల కింగ్ గాలి జనార్దన్ రెడ్డికిచెందిన బ్రాహ్మణి స్టీల్స్ కంపెనీ.. ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భారీ ఎత్తున శంకుస్థాపన చేసి… ప్రచారం కూడా చేసుకున్నారు. కట్ చేస్తే.. ఈ పరిశ్రమ పట్టాలెక్కలేదు సరికదా.. కాగితాల స్థాయి కూడా దాడలేదు.
2018-19 మధ్య అంటేసుదీర్ఘంగా పదేళ్ల కాలం తర్వాత.. అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రమే దీనికి నిధులు ఇవ్వాల్సి ఉంది. అయితే.. కేంద్రం నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే దీనిని నిర్మిస్తుందని.. తర్వాత.. కేంద్రం నుంచి వసూలు చేసుకుంటుందని.. చంద్రబాబు ప్రకటించారు. మొత్తానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. కట్ చేస్తే.. ఎన్నికలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మారిపోయి.. పనులు అటకెక్కాయి.
2019, డిసెంబరు 7న సీఎం జగన్ మరోసారి.. కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. తన తండ్రి, మాజీ సీఎం వైఎస్ చేసిన చోటుకాకుండా.. అదేవిధంగా చంద్రబాబు ఎంపికచేసిన ప్రాంతాన్ని కూడా పక్కన పెట్టి జగన్.. వేరే ప్రాంతంలో శంకుస్థాపన చేశారు. సరే.. ఎక్కడో ఒకచోట.. అయినా ఫ్యాక్టరీ నిర్మిస్తే.. చాలని అనుకున్నారు. శంకుస్తాపన అయిపోయింది. కానీ, పనులు మాత్రం జరగలేదు. ఇక, అప్పటి నుంచి ఎదురు చూపులే మిగిలాయి.
తాజాగా
2023, ఫిబ్రవరి 15న మరోసారి ఇదే సీఎం జగన్ .. కొత్తగా ఉక్కు ఫ్యాక్టరీకి శంకు స్థాపన చేయనున్నారు. అదేంటి? అంటున్నారు. అది అంతే.. ఇది లాజిక్కు అందని ప్రశ్న. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలోని కన్య తీర్థం వద్ద ఉక్కు పరిశ్రమకు భూమిపూజ చేస్తారు. అంటే.. మొత్తంగా ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన వ్యవహారం.. చెల్లి పెళ్లి మాదిరిగా తయారైంది. మరి ఇప్పటికైనా.. నిర్మాణానికినోచుకుంటుందా? అంటే.. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయి.. సో.. ఇంకోసారి శంకుస్థాపన తప్పకపోవచ్చు.. అని గేలి చేస్తున్నారు నెటిజన్లు.