విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో గ్యాంగ్ రేప్ జరిగింది…చేసింది టీడీపీ కార్యకర్తలే…టెన్త్ పబ్లిక్ పరీక్షల పేపర్లు లీక్ అయ్యాయి…టీడీపీ నేతల కాలేజీ యాజమాన్యాలే లీక్ చేయించాయి….పక్కింట్లో గేదె ఈనింది…అది టీడీపీ కార్యకర్తల పనే…ఎదురింటోళ్లకు కుక్క కరిచింది…అది కూడా టీడీపీ కుట్రే…వినడానికి విడ్డూరంగా ఉన్నా…ఇదేం పోలిక అని ఇకారంగా అనిపించినా…పైన చెప్పిన వాటిలో మొదటి రెండు ఆరోపణలు సాక్ష్యాత్తూ ఏపీ సీఎం జగన్ నోటి నుంచి జాలువారాయి…మిగతావి భవిష్యత్తులో వైసీపీ నేతల నోటి నుంచి జాలువారవని గ్యారెంటీ లేదు.
మీడియా రంగంలో ఉన్న వారికి…జర్నలిజంపై, వార్తలపై కొద్దో గొప్పో అవగాహన ఉన్నవారికి ఆవు వ్యాసం గురించి తెలిసే ఉంటుంది. ఆవు తెల్లగా ఉంటుంది…ఆవు పాలు ఇస్తుంది…ఆవు గడ్డి తింటుంది…ఇది ఆవు వ్యాసంలోని కొన్ని వాక్యాలు. కొందరు వ్యక్తులు వ్యాసం రాయమని తమకు ఏ టాపిక్ ఇచ్చినా సరే ఆవు వ్యాసం రాసి మమా అనిపిస్తుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి ఆవు వ్యాసం అనే పదాన్ని సెటైరికల్ గా వాడుతుంటారు.
ఏపీ సీఎం జగన్ మొదలుకొని వైసీపీలో అనామక నేతల వరకు అందరూ గత కొద్ది రోజులుగా ఈ ఆవు వ్యాసాన్ని టీడీపీకి ఆపాదిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో వరుస గ్యాంగ్ రేప్ ఘటనలు, టెన్త్ క్వశ్చన్ పేపర్ల లీక్ ఘటనలపై జగన్ తాజాగా చేసిన కామెంట్లు కూడా ఈ ఆవు వ్యాసం కిందకే వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ పరీక్ష పేపర్లను నారాయణ, చైతన్య స్కూల్ నుంచి లీక్ చేయించారని జగన్ ఆరోపణలు చేయడం సంచలనం రేపింది.
నారాయణ స్కూల్ టీడీపీ నేతది అని, తమకు అనుకూలంగా ఉన్న స్కూళ్ల నుంచే టెన్త్ పరీక్ష పత్రాలను వాట్సాప్ ద్వారా లీక్ చేయిస్తోంది టీడీపీనే అని జగన్ ఆరోపించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలో, గుంటూరు, విశాఖలో జరిగిన అత్యాచార ఘటనల్లో నిందితులందరూ టీడీపీకి చెందిన వారేనంటూ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ నిందితుల గురించి చంద్రబాబుకు మద్దతు పలికే మీడియా సంస్థలు రాయబోవని.. ఆ ఘటనలను వక్రీకరించి కథనాలు అందిస్తున్నారని అన్నారు.
దీంతో, జగన్ కామెంట్లపై ట్రోలింగ్ జరుగుతోంది. టెన్త్ పేపర్లు లీక్ అవుతుంటో నువ్వేం చేస్తున్నావు జగన్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కట్టుదిట్టమైన నిఘా పెట్టి పేపర్ లీక్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా అని నిలదీస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఇటువంటి ఘటనలు లేవు కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతి విషయాన్ని ప్రతిపక్షంపైకి నెట్టడమేనా అని మండిపడుతున్నారు.