ఏపీ సీఎం జగన్ సతీమణిపై జనసేన మహిళా విభాగం.. వీర మహిళ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగింది. రాష్ట్రంలో సోషల్ మీడి యా వార్ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీమణిపై చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు, పోస్టులపై చర్యలు తీసుకోకపోవడాన్ని వీర మహిళ నేతలు తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. అదే జగన్ భార్య వైఎస్ భారతిని ఎవరైనా ఏమైనా అంటే క్షణాల్లో పోలీసులు అరెస్టు చేస్తున్నారని.. ఇతరుల భార్యలపై చేసే విమర్శలపై ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని విమర్శించారు.
పవన్ కల్యాణ్ భార్యపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ వీరమహిళలు మంగళగిరిలోని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అయితే.. వీరి ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళగిరిలోని పార్టీలోని కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయానికి బయలుదేరిన మహిళా కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జనసేన కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై వారు మండిపడ్డారు.
సీఎం జగన్ భార్యను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెడుతున్న పోలీసులు.. పవన్ కల్యాణ్ భార్యను విమర్శిస్తూ పోస్టులు పెట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వీరమహిళలు ప్రశ్నించారు. దీనిపై మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. సీఎం జగన్ భార్యకు ఓ న్యాయం.. ఇతర మహిళలకు ఓ న్యాయమా? అని నిప్పులు చెరిగారు. కనీసం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు కూడా వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు.