నెల్లూరు సిటీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలిపై.. నెటిజన్లు నవ్విపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ నెల్లూరులో చేస్తున్న యువగళం పాదయాత్రకు జనాలు భారీ సంఖ్యలో వస్తున్నారు. బహుశ దీనిని తట్టుకోలేకో.. లేక, ఊరికేనే కూర్చుంటే వేరే సంకేతాలు వెళ్తారని భావిస్తున్నారో తెలియదు కానీ.. అనిల్ కుమార్ తాజాగా నారా లోకేష్‌పై విరుచుకుపడ్డారు.
అయితే.. అసలు రెండు రోజుల కిందట అనిల్ మాట్లాడుతూ.. నారా లోకేష్‌కు నాకు సాపత్యం ఏంటబ్బా! అని ప్రశ్నించారు. ఆయన ఓడిపోయిన నేత.. నేను వరుసగా గెలిచిన నాయకుడిని.. నాతో ఆయనకు పోలికాలేదు.. గీలికా లేదు.. అన్నారు. కానీ, ఇంతలోనే నారా లోకేష్‌పై విరుచుకుపడ్డారు. దీంతో నెటిజన్లు.. “ఏంది అనిలా.. ఏందిది.. ఓడిపోయాడంటావ్.. సవాళ్లు చేస్తావ్.. ఏందబ్బా నీ రాజకీయం!“ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
అనిల్ ఏమన్నారంటే..
తాజాగా మీడియాతో మాట్లాడిన అనిల్.. నారా లోకేష్‌కు ఆస్తులపై సవాళ్లు రువ్వారు. రాజకీయాల్లోకి రాక ముందు తన తండ్రి తనకు ఇచ్చిన ఆస్తి కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ఉందని నిరూపించే దమ్ము లోకేష్‌కు ఉందా? అని ప్రశ్నించారు. ఒకవేళ ఎక్కువగా ఉందని నిరూపించే దమ్ముంటే నా ఛాలెంజ్‌ను స్వీకరించు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. నెల్లూరు సిటీలో తనపై పోటీ చేయాలని లోకేష్‌కు మరో సవాల్ రువ్వారు.
“నాపై నారా లోకేష్ పోటీ చేయాలని కోరుతున్నా. నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా. మరి నారా లోకేష్ ఓడిపోతే.. ఏం చేయాలో ఆయనే చెప్పాలి’’ అని అనిల్ సవాల్ విసిరారు. అంతేకాదు.. నారా లోకేష్ తన ఆస్తులపైనా.. వ్యక్తిగతంగా తనపైనా చేసిన ఆరోపణలపై తిరుమల కొండపై ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు.
‘‘సభలో స్టేజిపై నుంచి నిన్న చర్చకు పిలవడం కాదు.. ఇప్పుడు రా చర్చకు.. మధ్యాహ్నం 2 గంటల వరకు టైం ఇస్తా.. చెప్పిన అరగంటలో నేను వస్తా. చర్చలకు సింగిల్‌గా వస్తా.. యుద్ధానికి రమ్మంటే వస్తా.. కావాలంటే నువ్వు వేల మందితో వచ్చినా ఒకే’’ అంటూ అనిల్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే అనిల్‌పై నెటిజన్లు కామెంట్లు రువ్వుతున్నారు.