“ప్లీజ్.. నేను అలా అనలేదు. నన్ను ఈ విషయంలోకి లాగొద్దు!“ ఇదీ.. దిగ్దర్శుకుడు.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఏపీ ప్రభుత్వానికి చేసిన విన్నపాలు. ప్రస్తుతం ఆన్లైన్ టికెట్ బుకింగ్ వ్యవహారం.. సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించేందుకు ఎవరూ ముం దుకు రావడం లేదు. పైగా.. ఏం మాట్లాడితే.. ఏం జరుగుతుందో అనే భయం కూడా టాలీవుడ్లో కనిపిస్తోం దని అంటున్నారు. దీంతో ఎవరికి వారు సైలెంట్‌గా ఉంటున్నారు.
ఇప్పటి వరకు ఏపీ సర్కారు అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బిల్లుపై మెగా హీరో.. చిరంజీవి మాత్రమే రియాక్ట్ అయ్యారు. కొన్ని సూచనలు చేశారు. వీటిపై స్పందిస్తామని.. ప్రభుత్వం తరఫున మంత్రి పేర్ని నాని కూడా పేర్కొన్నారు. అయితే.. ఇంతలోనే.. త్రివిక్రమ్ ఇలా.. అన్నారంటూ.. ఓ ట్వీట్ హల్చల్ చేసింది.
“ ప్రతి పాఠశాలలో ఒకటే ఫీజు, ప్రతి ఆస్పత్రిలోనూ ఒకటే బిల్లు ఎందుకు పెట్టరు, పేదవాడికి విద్య, వైద్యం కంటే సినిమా ఎక్కువా“ అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో చేసిన ట్వీట్ చేశారు. అయితే, దీనిపై వెంటనే మంత్రి పేర్ని రియాక్ట్ అయ్యారు .దీనిని పరిగణలోకి తీసుకున్న మంత్రి పేర్ని నాని.. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.
ఇక, ఇంతలోనే.. త్రివిక్రమ్ లైన్లోకి వచ్చారు. సినిమా టికెట్ ధరల విషయంలో తన పేరును ప్రస్తావిస్తూ నాని చేసిన వ్యాఖ్యాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు సామాజిక మాద్యమాల్లో ఎలాంటి ఖాతాలు లేవని, హారికా హాసినీ, ఫార్చున్ ఫర్ సినిమాస్ పేరుతో ఉండే ట్విట్టర్ ఖాతాల ద్వారా మాత్రమే అధికారికంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు.
తన పేరుతో సినిమా టికెట్ ధరలపై వచ్చిన అభిప్రాయాలను నమ్మవద్దని మంత్రి పేర్నినానితోపాటు ముఖ్యమంత్రి జగన్, ఏపీ సమాచార ప్రసార శాఖను కోరారు. తన పేరుతో వచ్చిన ట్వీట్ వ్యాఖ్యలపై స్పందించిన దర్శకుడు త్రివిక్రమ్.. హారికా హాసినీ క్రియేషన్ ట్విట్టర్ ఖాతా ద్వారా ఖండించారు.