ఇది నిజమే అయితే భలే ఆసక్తికరమైన ప్రాజెక్టే. ఎప్పుడూ అగ్ర కథానాయకులతోనే సినిమాలు చేసే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొంత విరామం తర్వాత ఓ మీడియం రేంజ్ హీరోతో మీడియం రేంజ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఆ హీరో రామ్ అన్నది ఇండస్ట్రీలో వినిపిస్తున్న కబురు.
ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకున్న త్రివిక్రమ్.. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ ఆలస్యమవడంతో ఎన్టీఆర్ ఈ సినిమాకు అందుబాటులోకి రావడానికి లేటవుతోంది. దీంతో త్రివిక్రమ్ ఏడాదికి పైగా ఖాళీగా ఉండాల్సి వస్తోంది. దీంతో మధ్యలో వేరే ఒక సినిమా చేయాలన్నది మాటల మాంత్రికుడి ప్రయత్నం.
ఐతే త్రివిక్రమ్ స్థాయికి తగ్గ స్టార్లెవ్వరూ ఇప్పుడు ఖాళీగా లేరు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఐదు సినిమాలకు కమిట్మెంట్లు ఇచ్చాడు. మహేష్ బాబు సర్కారు వారి పాట మొదలుపెడుతున్నాడు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్తో బిజీ. బన్నీయేమో ఒకటికి రెండు సినిమాలు లైన్లో పెట్టాడు. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లు కూడా బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో యువ కథానాయకుడు రామ్ మీద త్రివిక్రమ్ కళ్లు పడ్డాయట.
ఇంతకుముందు స్టార్ల సినిమాల నుంచి బ్రేక్ తీసుకుని నితిన్‌తో అఆ చేసినట్లే రామ్‌తో ఓ మీడియం రేంజ్ సినిమా చేద్దామని త్రివిక్రమ్ చూస్తున్నాడట. ఇంత మంచి అవకాశం వస్తే రామ్ నో అని ఎందుకంటాడు? గత ఏడాది ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్‌బస్టర్ కొట్టిన రామ్.. రెడ్ సినిమాను పూర్తి చేసి కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. త్రివిక్రమ్‌తో సినిమా ఓకే అయితే హీరోగా అతడి రేంజ్ మారుతుందనడంలో సందేహం లేదు.