తెలంగాణలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ కు సంబంధించి అప్పుడప్పుడు మెరుపుల మాదిరి కొన్ని అంశాలు తెర మీదకు రావటం తెలిసిందే. తాజాగా అలాంటి పరిస్థితే మరోసారి ఎదురైంది. ఫోన్ ట్యాపింగ్ లో ఇప్పటివరకు బయటకు వచ్చిన అంశాలకు మించిన షాకింగ్ అంశం ఒకటి తాజాగా తెర మీదకు వచ్చింది. ట్యాపింగ్ దర్యాప్తు మొదలై ఇప్పటికి ఏడాది కావొస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా వెలుగు చూసిన విషయం ఏమంటే.. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయిన వైనం వెలుగు చూసింది. ఇంద్రసేనారెడ్డి ఓఎస్డీ జి.నరసింహులు పేరిట ఉన్న ఫోన్ నంబరును తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి కేంద్రంగా ట్యాప్ అయినట్లుగా వెల్లడైంది. ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్ పోలీసులు రెండు రోజులక్రితం నర్సింహులును పిలిచి విచారించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. పోలీసులు చెప్పే వరకు తన ఫోన్ ట్యాప్ అయిన విషయం తనకు తెలీదని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
అయితే.. ఈ నెంబరును ట్యాప్ చేయాలని ఎస్ఐబీని ఎవరు ఆదేశించారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ విషయం తేలాలంటే.. అమెరికాకు పారిపోయిన ట్యాపింగ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును విచారిస్తేనే తెలుస్తుందని చెబుతున్నారు. ఆయన్ను భారత్ కు తీసుకొచ్చేందుకు పలు ప్రయత్నాలు చేసినప్పటికి.. ఇప్పటివరకు ఎవీ వర్కువుట్ కాలేదు. తెలంగాణ గవర్నర్ గా పని చేసిన తమిళ సై ఫోన్ ను సైతం టయాప్ చేసినట్లుగా గతంలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
అయితే.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో ఆ విషయమేమీ బయటకు రాలేదు. 2014 నుంచి తన ఓఎస్డీ పేరుతో ఉన్న ఫోన్ నెంబరును ఇంద్రసేనారెడ్డి వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 నవంబరులో జరిగిన అసెంబ్ల ీఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ నంబరును ట్యాపింగ్ జాబితాలో చేర్చినట్లుగా గుర్తించారు.
త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డి 2023 అక్టోబరు 18న ఎంపిక కావటం.. అదే నెల 26న బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్రంలో అప్పటికే ట్యాపింగ్ వ్యవహారం సాగుతున్న నేపథ్యంలో ఆయన నెంబరునూ చేర్చినట్లుగా తెలుస్తోంది. బీజేపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా.. జాతీయ కార్యదర్శిగా పని చేసిన ఇంద్రసేనారెడ్డికి బీజేపీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండటం తెలిసిందే. బీజేపీ అగ్రనాయకత్వంతో ఉన్న సంబంధాల నేపథ్యంలో కేంద్రంలోని కీలక రహస్యాలు తెలుసుకునే అవకాశం ఉందన్న కోణంలో గవర్నర్ హోదాలో ఉన్న ప్రముఖుడి ఫోన్ ను సైతం ప్రభాకర్ రావు టీం ఏ మాత్రం జంకు లేకుండా ట్యాపింగ్ చేసిన వైనం విస్మయానికి గురి చేస్తోంది.
ఇప్పటివరకు వెలుగు చూసిన ట్యాపింగ్ దందాలో ప్రముఖులు.. హైకోర్టు జడ్జి దంపతుల ఫోన్లను ట్యాప్ చేసిన వైనం వెలుగు చూసి అందరిని అవాక్కు చేయగా.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి.. ఏకంగా గవర్నర్ హోదాలో ఉన్న ప్రముఖుడి ఫోన్ ను సైతం ట్యాపింగ్ చేసిన తీరు వెలుగు చూడటం సంచలనంగా మారింది. రానున్న రోజుల్లో మరెన్ని ఈ వ్యవహారంలో మరెన్ని సంచలనాలు వెలుగు చూస్తాయో చూడాలి.