తృప్తి డిమ్రి.. గత ఏడాది విడుదలైన యానిమల్ మూవీతో ఈ బాలీవుడ్ బ్యూటీ జాతకమే మారిపోయింది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ లో హీరోయిన్ గా నటించిన రష్మిక అయినప్పటికీ.. ఎక్కువ గుర్తింపు మాత్రం తృప్తికే వచ్చింది. సెకండాఫ్ లో వచ్చే జోయా పాత్రలో మెరిసిన తృప్తి.. సినిమాకే హైలైట్ గా నిలిచింది. నేషనల్ వైడ్ గా పాపులారిటీ సంపాదించుకుంది. యువతరానికి కొత్త క్రష్ గా మారిపోయింది.
యానిమల్ తర్వాత తృప్తికి హీరోయిన్ గా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఈమె కథానాయికగా నటించిన `బ్యాడ్ న్యూజ్` మూవీ ప్రస్తుతం నార్త్ లో విడుదలకు సిద్ధం అవుతోంది. ఆనంద్ తివారీ దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, ట్రిప్తి డిమ్రీ మరియు అమ్మీ విర్క్ ప్రధాన పాత్రలను పోషించారు. జూలై 19న బ్యాడ్ న్యూజ్ మూవీ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ముంబైలో తాజాగా బ్యాడ్ న్యూజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ తృప్తి బ్లాక్ కలర్ మినీ డ్రెస్ లో సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. మత్తెక్కించే అందాలతో అందరి చూపులు తనవైపుకు తిప్పుకుంది.
అయితే ఇప్పుడు తృప్తి ధరించిన డ్రెస్ ధర హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఆమె మినీ డ్రెస్ కాస్ట్ వేలల్లో కాదు లక్షల్లో ఉంది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ వెర్సాస్ నుంచి మిరుమిట్లు గొలిపే బ్లాక్ డ్రెస్ ను తృప్తి ఎంచుకుంది. ఈ డ్రెస్ విలువ 4,873 డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో అక్షరాల రూ. 4,06,234. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకైపోతున్నారు. ఎంతైనా యానిమల్ బ్యూటీ రేంజే వేరంటూ చర్చించుకుంటున్నారు.