హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక హెచ్ సీయూ యూనివర్సిటీకి సంబంధించిన వందలాది ఎకరాల్లో చెట్లు నరుకుతున్న అంశంపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. వన్యప్రాణులకు, పర్యావరణానికి నష్టం కలిగించేలా రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోందని, చెట్ల నరికివేత వెంటనే ఆపాలని హెచ్ సీయూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఆ విద్యార్థులకు పలువురు సెలబ్రిటీలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలోనే చెట్ల నరికివేత తక్షణమే ఆపాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
రేపటి వరకు చెట్లు నరకడంతో పాటు హెచ్ సీయూ పరిధిలో ఎటువంటి పనులు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. అయితే, ఆ ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం బేఖాతరు చేస్తూ చెట్ల నరికివేత కొనసాగిస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చెట్లను ఈ రోజు కూడా నరికివేస్తున్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రేవంత్ సర్కార్ ను దుయ్యబడుతున్నారు. మరోవైపు, హెచ్ సీయూలో చెట్ల నరికివేత అంశంపై బీఆర్ఎస్ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.