“రాష్ట్రానికి సీఎంగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్నాయి. కోర్టుకు ముఖ్యమంత్రి హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి. అడ్వకేట్ కమిషనర్ ను నియమించి ఆయన సమక్షంలో సాక్ష్యం నమోదు చేయించాలి” అని కోడికత్తి కేసులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు.. ఈ కేసు దర్యాప్తును లోతుగా జరపాలంటూ మరో పిటిషన్ కూడా కూడా వేశారు. ఈ పిటిషన్లపై ఈ నెల 13న విచారణ జరుపుతామని ఎస్ఐఏ కోర్టు తెలిపింది.
2018 అక్టోబరులో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్పై పాదయాత్ర చేసి హైదరాబాద్కు వెళ్తున్న సమయంలో విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాసరావు అనే యువకుడు(అతను తాను వైసీపీ అభిమానినని ప్రకటించుకున్నాడు) కోడి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. దానిపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న సంగతీ తెలిసిందే. ఈ కేసు విచారణకు బాధితుడిగానే గాక సాక్షిగా ఉన్న జగన్ కూడా హాజరుకావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యం నమోదు చేయాలని కోర్టును కోరారు.
కోడి కత్తి కేసును సోమవారం న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో సాక్షి, బాధితునిగా ఉన్న సీఎం జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరు కావాలని గత వాయిదా సందర్భంగా మెజిస్ట్రేట్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే. దీనిలో ప్రజల ట్రాఫిక్ కష్టాలు పేర్కొనడం.. తాను వస్తే.. ప్రజలు ఇబ్బందులు పడతారని పేర్కొనడంపై న్యాయవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తప్పించుకునే వ్యూహం బాగానే ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.