టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ తో పాటు, కొన్ని పత్రికలు, న్యూస్ ఛానళ్లపై రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి, ఆయన సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆనాడు అనుకుని ఉంటే చంద్రబాబు ఇంట్లోకి వెళ్లి మొద్దు శ్రీను చంపేవాడని చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది.
14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబునాయుడును… వైఎస్ ఒక్కమాట చెప్పివుంటే మొద్దుశీను చంపేవాడని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడడం ఆయన ఫ్యాక్షనిజం నైజాన్ని తెలియజేస్తోందని టీడీపీ నేతలు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని మండిపడుతున్నారు. ఫ్యాక్షనిజం మొదలుపెడితే లోకేశ్ ని టార్గెట్ చేస్తామని బహిరంగంగా బరితెగించి చెప్పడం ఏమిటని , వారు మాట్లాడుతున్న భాష జుగుప్సాకరంగా ఉందని టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యాఖ్యలపై తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖరరెడ్డి క్షమాపణలు చెప్పారు. ఎస్పీని కలిసేందుకు అనుచరులతో కలిసి ర్యాలీగా అనంతపురం వచ్చిన చంద్రశేఖర రెడ్డి ఆ తర్వాత వారికి క్షమాపణలు చెప్పారు. తమ విధానాలను చెప్పే విషయంలో చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై ఆవేదనతో ఏదైనా మాట్లాడి ఉంటే ప్రజల తరపున, పార్టీ శ్రేణుల తరపున తాను క్షమాపణ కోరుతున్నట్టు చంద్రశేఖర రెడ్డి తెలిపారు. దీంతో, అడుసు తొక్కనేల..కాలు కడగనేల అన్న రీతిలో…నోటికొచ్చినట్లు మాట్లాడడం ఎందుకు…క్షమాపణలు అడగడం ఎందుకు అని విమర్శలు వస్తున్నాయి.