తెల్ల రేషన్ కార్డు లేకుంటే రాదు…
రైస్ కార్డు లేకపోయినా నో చాన్స్
తల్లికి, విద్యార్థికి ఆధార్ లేకపోయినా ఇవ్వరు
లక్షలాది మంది తల్లులకు పథకం దూరం
లబ్ధిదారుల సంఖ్యలో కోతే ఏకైక ఎజెండా
కోట్ల మేర భారం తగ్గించుకునే ప్లాన్
‘ప్రతి తల్లికీ ఎందరు పిల్లలుంటే వారందరికీ ‘అమ్మఒడి’ లబ్ధి రూ.15 వేలు అందజేస్తాం. మారు మాటే లేదు’ అని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. మాటా మడమ రెండూ తిప్పారు. పిల్లల్లో ఒక్కరికే ఇస్తామన్నారు. మోసపోయిన అమ్మలు.. ఒకరికైనా వస్తోంది కదా అనుకుని సమాధానపడ్డారు. కానీ అందులోనూ భయంకరంగా కోతపెడుతున్నారు. లబ్ధిదారుల సంఖ్యను భారీగా తగ్గించడమే ఏకైక ఎజెండాగా ప్రభుత్వం రెండో విడత ‘అమ్మ ఒడి’ చుట్టూ ఆంక్షల వలయం ఏర్పాటు చేసింది. తెల్ల రేషన్ కార్డుల రద్దు , ఒకటో తరగతిలో చేరే విద్యార్థి వయస్సు నిబంధన, ఆధార్ నంబర్ కిరికిరి పెట్టి తల్లులకు క్షోభ కలిగిస్తోంది.
కుటుంబ ఆదాయం పట్టణాల్లో నెలకు రూ.12 వేల లోపు, గ్రామాల్లో రూ.10 వేల లోపు ఉండాలని.. వారికి భూములు మాగాణి 3 ఎకరాల్లోపు, మెట్ట 10 ఎకరాల్లోపు.. రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలని ఉత్తర్వులిచ్చింది. విద్యుత వినియోగం ఆర్నెల్ల సరాసరి 300 యూనిట్లలోపు ఉండాలి. పారిశుధ్య కార్మికులు తప్ప మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఈ పథకానికి అనర్హులు. దానికి తగినట్లుగానే అమ్మఒడి దరఖాస్తుల్లో చాలావరకు అనర్హత ముద్ర వేసి లబ్ధిదారులకు మొండిచేయి చూపారు. తల్లి, బిడ్డ ఒకే కుటుంబానికి చెంది.. వారి పేర్లు ఒకే రేషన కార్డులో ఉండి.. సచివాలయంలో మ్యాప్ అయినప్పటికీ, బ్యాంకు అకౌంట్ సమర్పించినప్పటికీ.. అనర్హత జాబితాలో పెట్టేశారు.
స్కూల్ నుంచి తాము కరెక్ట్‌గానే అప్లోడ్ చేశామని, కావాలంటే చూడండంటూ అప్లోడ్ చేసిన సమాచారాన్ని హెడ్మాస్టర్లు చూపిస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్తే… అలాంటి దరఖాస్తులను ఏమి చేయాలో? తమకు ఎలాంటి సూచనలు ప్రభుత్వం నుంచి రాలేదని సిబ్బంది పేర్కొంటున్నారు. ఆధార్ నంబరు సరిపోలలేదనే కారణంతో అనర్హతగా పేర్కొన్న వారి విషయంలో ఏమి చేయాలో సచివాలయ సిబ్బందికీ అంతుపట్టడం లేదు. అమ్మఒడి మంజూరు కోసం తల్లులు స్కూళ్లు, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా.. పరిష్కారం దొరకడం లేదు. పలు దరఖాస్తులు అండర్ ప్రాసెస్ అని చూపిస్తూ చికాకు కలిగిస్తోందని చెప్తున్నారు.
కొన్ని దరఖాస్తులకు సంబఽంధించి నో డేటా ఫౌండ్ అంటూ కంప్యూటర్లో సమాచారం కనిపిస్తోంది. సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్అసిస్టెంట్, పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీఓ/మున్సిపల్ కమిషనర్, సంక్షేమ జాయింట్ కలెక్టర్ ఇలా వరుసగా అందరూ పరిశీలించి ఓకే చేస్తేనే అమ్మఒడి మంజూరవుతుంది. ఈ ప్రక్రియ చేపట్టేందుకు 10 రోజులు గడువిచ్చారు. కానీ ఈ నెల 11వ తేదీన అమ్మఒడి నిధులను సీఎం జగన్ తల్లుల ఖాతాల్లో జమచేసేశారు. మరి పెండింగ్‌లో ఉన్న తమ దరఖాస్తుల పరిస్థితి ఏంటని తల్లులు వాపోతున్నారు.
పారిశుధ్య కార్మికులకు దక్కని పథకం…
అమ్మఒడి లబ్ధిపొందేందుకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు పారిశుధ్య కార్మికులకు వర్తించబోవని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అందుకే వారికి రైస్ కార్డు ఇవ్వాలని సూచించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణాల్లో పారిశుధ్య సిబ్బందికి వార్డు సచివాలయ సిబ్బంది రైస్ కార్డులు మంజూరుచేశారు. రైస్ కార్డు ఉండటంతో వారు కూడా అమ్మఒడి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. కానీ అవన్నీ పెండింగ్‌లో పెట్టారు. ఎందుకంటే వారి జీతం రూ.12 వేలకు మించి ఉందని అమ్మఒడికి అర్హులు కారంటూ అనర్హత జాబితాలోకి నెట్టారు. ఇలా అనేక రకాల సమస్యలతో అమ్మఒడి విప్పలేని సమస్యల ముడిగా తయారైందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
రేషన్ కార్డుల రద్దుతో..
ప్రభుత్వం తాజాగా రకరకాల సర్వేలు, కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా 8.43 లక్షల తెల్లరేషన్ కార్డులను రద్దు చేసింది. వీటి స్థానంలో కొందరికి రైస్ కార్డులను మంజూరు చేసింది. ఈ విషయమై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రద్దు చేసిన రేషన్ కార్డుదారుల్లో అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తుచేసుకుంటే పరిశీలించి వెంటనే కార్డులను మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అమ్మఒడికి తెల్లరేషన్ కార్డు ప్రధాన అర్హత. తెల్ల కార్డుల రద్దుతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల మంది తల్లులకు ‘అమ్మఒడి‘ ఆర్థిక సాయం దూరమైంది. కొత్తగా ఒకటో తరగతిలోకి అడ్మిషన్ తీసుకున్న చిన్నారుల వయస్సుకు- ‘అమ్మఒడి’ సాయానికీ లింకు పెట్టారు. నిరుడు ఆగస్టు 31 నాటికి 5 సంవత్సరాల వయస్సు నిండని ఒకటో తరగతి పిల్లల తల్లులకు ‘అమ్మఒడి’ సాయం అందదన్న నిబంధన పెట్టడంతో వేలాది మంది తల్లులకు అర్హత లేకుండా పోయింది.
జూనియర్ ఇంటర్ విద్యార్థుల పరిస్థితి ఏంటి?
2020-21 విద్యా సంవత్సరంలో ఇప్పటి వరకు జూనియర్ ఇంటర్ అడ్మిషన్లే పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. అమ్మఒడిని పొందేందుకు ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థుల తల్లులు కూడా అర్హులే. కానీ అడ్మిషన్లు చేయని కారణంగా వారికి అమ్మఒడి అందలేదు. అడ్మిషన్లు పూర్తయ్యాక ఎప్పుడు ఇస్తారో స్పష్టత ఇవ్వలేదు. ఆయా విద్యార్థులు కళాశాలల్లో చేరిన తర్వాతే జ్ఞానభూమి పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి అమ్మఒడికి అర్హుల జాబితా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంటుంది.
వలస కార్మికులకు ‘అమ్మఒడి’ దూరం
కరోనా కారణంగా రాషా్ట్రనికి చెందిన వేలాది మంది కార్మికులు పొరుగు రాషా్ట్రలైన కర్ణాటక, తమిళనాడు, ఒడిశా తదితర రాషా్ట్రల నుంచి మన రాషా్ట్రనికి తిరిగి చేరుకున్నారు. ముఖ్యంగా తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లాకు, కర్ణాటక నుంచి అనంతపురం జిల్లాకు, ఒడిశా నుంచి శ్రీకాకుళం, గోదావరి జిల్లాలకు వచ్చారు. వారి పిల్లలను తాజాగా సమీప పాఠశాలల్లో ఒకటో తరగతిలో చేర్పించారు. వారికి వయస్సు నిబంధన తెలియదు. తాజాగా అమ్మఒడికి ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా ఆయా కుటుంబాల తల్లులకు ఆర్థిక సహాయం దక్కలేదు. ఇలా ఈ పథకాన్ని ప్రభుత్వం లొసుగులమయంచేసింది. భారం తగ్గించుకోవడానికి సవాలక్ష సంక్లిష్టతలు తీసుకొచ్చింది. వాటికి పరిష్కారం చూపకుండా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది.