ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నరేళ్ల కిందట వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నెన్నో సమస్యలు. మామూలుగా ఉన్న సమస్యలకు తోడు.. ప్రభుత్వం తెచ్చిపెట్టిన ఇబ్బందులు బోలెడు. ఆ జాబితా చాలా పెద్దదే.
కేవలం పథకాల పేరుతో అకౌంట్లలో డబ్బులేయడం తప్పిస్తే పరిపాలన అన్నదే లేక.. ధరలన్నీ పెరిగిపోయి, రోడ్ల లాంటి మౌళిక వసతులు దారుణంగా దెబ్బ తిని.. అభివృద్ధి పూర్తిగా కుంటుపడి జనాలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కానీ ఇవేవీ ఇబ్బందులు కావన్నట్లు.. పరిష్కరించడానికి ఇంకే సమస్యా లేనట్లు.. సినిమా టికెట్ల అంశాన్ని నెత్తికెత్తుకుంది జగన్ సర్కారు. పోనీ నిజంగా అక్కడ సమస్య ఉందా అంటే లేదు.
ప్రభుత్వమే ఒక సమస్యను సృష్టించి.. దాని చుట్టూ గందరగోళాన్ని పెంచి ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెట్టడమే కాక.. తాను కూడా ఇబ్బందుల్లో చిక్కుకుని విమర్శల జడిలో మునిగి తేలుతోంది. ఇండస్ట్రీ నుంచి కూడా ఈ సమస్య పట్ల స్పందిస్తున్న తీరు విస్మయం గొలుపుతోంది. అందరూ కలిసి దీన్నో పెద్ద సంక్షోభం లాగా.. పరిష్కారం కాని సమస్యలా మార్చేశారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువేమీ కాదు. నియంత్రణలో ఉన్నాయి. 100-150 రేటుతో ఏసీ థియేటర్లో వందల కోట్ల ఖర్చుతో తీసిన ప్రపంచ స్థాయి సినిమాలను మూడు గంటల చూసే అవకాశం దక్కుతోంది.
ఢిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల్లో డిమాండును వీకెండ్స్‌లో టికెట్ రేటు రూ.1500-2000 కూడా ఉంటోంది. విదేశాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. యుఎస్‌లో మంచి క్రేజున్న తెలుగు సినిమా చూడాలంటే 25-35 డాలర్ల రేటు పెట్టాలి. ఆ లెక్కన చూసుకుంటే 100-150 పెట్టి సినిమా చూడటం తెలుగు ప్రేక్షకులకు భారం ఏమీ కాదు.
ఆడియన్స్ నుంచి కూడా దీనిపై ఎలాంటి కంప్లైంట్లు లేవు. నిజానికి ఏపీలో విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసరాలు.. పెట్రోలు, ఇసుక లాంటి వాటి విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ ధరలు తగ్గించాలని కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోవడం మానేసి.. ఎవ్వరూ అడగని టికెట్ల రేట్ల విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
నిజానికి ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకున్న ఉద్దేశం వేరు. గత ఏడాది వేసవిలో వచ్చిన జగన్ రాజకీయ ప్రత్యర్థి పవన్ కళ్యాణ్ సినిమా ‘వకీల్ సాబ్’ను ఇబ్బంది పెట్టడంలో భాగంగా పదేళ్ల కిందటి ధరలతో జీవోను బయటికి తీసింది. దాన్ని పట్టుబట్టి అమలు చేయించింది.
ఐతే ఈ జీవో ప్రకారం పెద్ద నగరాలు, పట్టణాల్లో ధరలు ఓకే కానీ.. నగర శివార్లలో ఉండే పంచాయితీల పరిధిలో, మున్సిపాలిటీల్లో, గ్రామ పంచాయితీల్లో టికెట్ల ధరలే అన్యాయంగా ఉన్నాయి. ఇలాంటి ఏరియాల్లో కూడా సిటీలకు దీటుగా థియేటర్లను అధునాతనంగా తీర్చిదిద్దారు ఎగ్జిబిటర్లు. మరి అక్కడ టికెట్ల ధరలను రూ.60, 40, 20, 10, 5… ఇలా నిర్ణయిస్తే ఎలా గిట్టుబాటు అవుతుంది.
నిత్యావసరాల ధరలైనా, మెయింటైనెన్స్ ఖర్చులైనా అన్ని చోట్లా ఒకేలా ఉంటాయన్న బేసిక్ సూత్రాన్ని అర్థం చేసుకోకుండా ఏరియాలను బట్టి ఇలా రేట్లు తగ్గించడంతో థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ధరలు తెచ్చాక ఏపీలో ఒక్క సినిమా కూడా ‘హిట్’ అనిపించుకోలేదు. అన్నీ నష్టాల బాట పట్టాయి. వేరే ప్రాంతాల్లో బ్లాక్ బస్టర్లయిన అఖండ, పుష్ప లాంటి సినిమాలు కూడా ఇక్కడ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయాయి. అందుక్కారణమేంటో అందరికీ తెలుసు.
పెరిగిన బ్లాక్
టికెట్ల రేట్ల తగ్గింపు కోసమే అని ప్రేక్షకుల జేబులు గుళ్లకాకుండా ఉండటం కోసమే అని ఏపీ ప్రభుత్వం నొక్కి వక్కాణిస్తోంది. ఈ నిబంధనలు బాగున్నాయి, ప్రకటనలు బాగున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతోందేంటో చూస్తే ప్రభుత్వ ఉద్దేశం ఏమేర నెరవేరుతోందన్నది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది.
నిజానికి ఏపీ మంత్రులు టికెట్ల రేట్ల తగ్గింపు గురించి మాట్లాడుతున్నపుడల్లా ఈ బ్లాక్ మార్కెట్ దందా గురించే ప్రస్తావిస్తున్నారు. ఐతే 100 రూపాయల టికెట్‌ను వెయ్యికో, రెండు వేలకో అమ్ముతున్నది బ్లాక్‌లో. దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది. థియేటర్ల మీద నిఘా ఉంచి అధిక ధరలకు టికెట్లు అమ్మకుండా చూడాల్సింది ప్రభుత్వమే. భారీ చిత్రాలు రిలీజైనపుడు పోలీసుల్ని పంపి బ్లాక్‌లో టికెట్లు అమ్ముతున్నారేమో చూడాలి.
కౌంటర్లలోనే పెట్టి ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతుంటే కఠిన చర్యలు చేపట్టాలి. జనాల్లో కూడా చైతన్యం పెంచాలి. ఎవరైనా బ్లాక్‌లో టికెట్లు అమ్ముతుంటే ఫిర్యాదు చేయాలని థియేటర్ల ముందు బోర్డులు పెట్టించాలి. అంతే తప్ప ఏదో పెద్ద సినిమాకు డిమాండ్ ఉన్నపుడు ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్ముతున్నారని.. థియేటర్ ఉన్న ప్రాంతాన్ని బట్టి రూ.20, 30, 40, 50కి రేట్లు తగ్గించేయడం ఏం లాజిక్కో అర్థం కాదు.
నిజానికి ఇలా తగ్గించాక బ్లాక్ టికెట్ల దందా ఇంకా పెరిగిందన్నది ప్రేక్షకుల నుంచి వస్తున్న ఫిర్యాదు. ఈ సంగతి గమనించకుండా మొండి వైఖరి, వాదనలతో కాలక్షేపం చేస్తూ పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టడం ఎంత వరకు సబబు?
మాట్లాడితే పాపం
ఏపీలో సినిమా టికెట్ల ధరల వల్ల ఇండస్ట్రీనే సంక్షోభంలో పడే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే కరోనా దెబ్బకు అల్లాడిపోయిన ఇండస్ట్రీకి.. ఈ ధరలు శాపంగా మారాయి. ఏపీలో సినిమాల రెవెన్యూ బాగా పడిపోయిన విషయంలో కొన్ని నెలలుగా ప్రతి చిత్రం విషయంలోనూ చూస్తూనే ఉన్నాం. అయినా ప్రభుత్వంలో కదలిక కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ జనాలు బాధను ఆపుకోలేక గళం విప్పుతున్నారు. కానీ వాళ్ల మీద ఏపీ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మధ్య ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో ఏపీ సర్కారు తీరును తీవ్ర స్థాయితో దుయ్యబట్టాడు పవన్ కళ్యాణ్. దీంతో ఏపీ మంత్రులు, వైకాపా నాయకులు ఆయన మీద తీవ్ర స్థాయిలో ఎదురు దాడికి దిగారు.
మరోవైపు నాని తన అసహనాన్ని వ్యక్తం చేస్తే అతడి సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’కి ఇబ్బందులు కలిగించారు. ఆ సినిమా ఆడుతున్న థియేటర్ల మీద దాడులు జరిపి నిబంధనలు పాటించలేదని మూత వేయించారు. దీంతో ఇండస్ట్రీలో మిగతా జనాల్లో భయం పుట్టి ఈ వ్యవహారంపై మాట్లాడ్డం మానేసే పరిస్థితి వచ్చింది.
ప్రభుత్వానికి సమస్య అర్థమవుతోందని.. త్వరలోనే పరిష్కారం వస్తుందని.. నెలల నుంచి చెబుతున్నారు తప్ప ఎంతకీ సమస్య తెగట్లేదు. పన్ను ఎగవేతల్ని అరికట్టేందుకు ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను తెస్తామని.. పూర్తిగా ప్రతి టికెట్ అందులోంచే బుక్ చేసుకునేలా చూస్తామని.. దాని వల్ల పక్కాగా ట్యాక్స్ కట్టే పరిస్థితి వస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
కానీ ఆన్ లైన్ టికెటింగ్ పేరుతో ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోందని.. టికెట్ డబ్బులను వెంటనే చెల్లించకుండా ఇబ్బంది పెడతారని.. దీని వల్ల మధ్యలో కమిషన్లు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఇండస్ట్రీ జనాల్లో.
ఎవరి ప్రయోజనాలు వారివి
మంచు మోహన్ బాబుకు ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవాలని కోరిక. ఈ విషయం ఆయన నేరుగా చెప్పలేదు కానీ.. వివిధ సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలు, చర్యలు ఇదే ఉద్దేశాన్ని చాటి చెబుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సందర్భంగా ఆయన, కొడుకు మంచు విష్ణు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
ఐతే హోదా అనుభవించడానికి సిద్ధంగా ఉండే మోహన్ బాబు..బాధ్యత తీసుకుని ఏదైనా చేయమంటే మాత్రం ముందుకు రారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు బావ అని.. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ తనకు మేనల్లుడని చెప్పుకునే మోహన్ బాబు.. ఇండస్ట్రీని సంక్షోభంలోకి నెడుతున్న సమస్య గురించి ఆయనతో వెళ్లి ఎందుకు మాట్లాడట్లేదు.. పరిష్కరించట్లేదన్నది అర్థం కాని విషయం.
ఈ దిశగా ఏమీ చేయకుండా ఇండస్ట్రీ జనాల మీదే రాళ్లేస్తూ.. వెళ్లి సీఎంకు సన్మానం చేద్దాం, ఆయన్ని వేడుకుందాం అంటూ ఆయన లేఖ రాయడం విడ్డూరం. ఇక ‘మా’ అధ్యక్షుడు అయ్యాక మంచు విష్ణు చేస్తున్న అతి గురించి కూడా అందరికీ తెలిసిందే. అతను కూడా ఈ విషయంలో స్పందించట్లేదు.
పైగా ఎవరూ ఈ విషయం గురించి బహిరంగ వేదికల్లో మాట్లాడకూడదని అంటున్నాడు. మరోవైపు అక్కినేని నాగార్జునేమో ‘బంగర్రాజు’కు సంబంధించిన ప్రెస్ మీట్లో మీడియా వాళ్లు టికెట్ల ధరల విషయాన్ని ప్రస్తావిస్తే తన సినిమాకు ఈ రేట్లతో సమస్య లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతే కాక సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడనన్నాడు.
ఐతే ఇండస్ట్రీ సమస్య గురించి అడిగితే రాజకీయాలు మాట్లాడననడమేంటో అంతు బట్టడం లేదు. దీన్ని బట్టి ఎవరి ప్రయోజనాలు వారివన్న విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. సమస్య మాత్రం ఎంతకీ పరిష్కారం కావడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా కలిసి ఈ సమస్య గురించి చర్చించి వచ్చారు. మరి టికెట్ల రేట్ల వ్యవహారం ఎప్పటికి పరిష్కారం అవుతుందో.. ఇండస్ట్రీ ఇబ్బందులు ఎప్పటికి తొలుగుతాయో చూడాలి.