టాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు సాగర్ (70) గురువారం నాడు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాగర్ చెన్నైలోని తన నివాసంలో ఈ రోజు తెల్లవారుఝామున కన్నుమూశారు. సాగర్ మృతి పట్ల పలువురు దర్శకులు, నిర్మాతలు, హీరోలు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాగర్ అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం చెన్నైలో నిర్వహించనున్నారు.
సాగర్ పూర్తి పేరు విద్యా సాగర్ రెడ్డి. 1952లో గుంటూరులో ఆయన జన్మించారు. 1983లో దర్శకుడిగా కెరీర్ ఆరంభించే ముందు అనేక తెలుగు సినిమాలకు ఫిల్మ్ ఎడిటర్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా, వివిధ హోదాల్లో పనిచేశారు. 1983లో నరేశ్, విజయశాంతిల కాంబోలో ‘రాకాసి లోయ’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలుబెట్టారు. ‘ఖైదీ బ్రదర్స్’, ‘స్టూవర్ట్‌పురం దొంగలు’, ‘అమ్మ దొంగ’, ‘రామ సక్కనోడు’, ‘యాక్షన్ నెం.1’, ‘అన్వేషణ’, ‘ఓసి నా మరదల’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
90వ దశకంలో విభిన్నమైన కథా చిత్రాలను తెరకెక్కించిన దర్శకుల జాబితాలో సాగర్ ఒకరు. క్రమశిక్షణ గల దర్శకుడిగా ఆయనకి మంచి పేరుంది. ఇటు కుటుంబ కథాచిత్రాలను .. అటు యాక్షన్ సినిమాలతో అలరించిన ఘనత ఆయనదే. తెలుగు సినిమా దర్శకుల సంఘానికి 3 సార్లు అధ్యక్షుడిగా సాగర్ పని చేశారు. శ్రీను వైట్ల, వి.వి.వినాయక్, రవి కుమార్ చౌదరి, జి. నాగేశ్వర రెడ్డి వంటి అగ్ర దర్శకులు సాగర్ శిష్యులే.