టాలీవుడ్లో కెరీర్ ఆరంభం నుంచి ప్రయోగాలకు పెట్టింది పేరుగా నిలుస్తూ వస్తున్నాడు అక్కినేని నాగార్జున. తన తరం బడా హీరోల్లో నాగార్జున చేసినన్ని ప్రయోగాలు, సాహసోపేతమైన చిత్రాలు ఇంకెవరూ చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో కొత్త దర్శకుడైన రామ్ గోపాల్ వర్మను నమ్మి ‘శివ’ చేశాడు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో మరే హీరో సాహసించలేని ‘గీతాంజలి’లో నటించాడు.
ఇక మూడు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో ఇలాంటి మరెన్నో సాహసాలు నాగ్ కెరీర్లో కనిపిస్తాయి. వయసు పెరిగి 60 ప్లస్‌లోకి వచ్చేసినా కూడా ఆయన ఇప్పటికీ చాలా ట్రెండీగానే కనిపిస్తారు. ఇటీవలే ‘వైల్డ్ డాగ్’ లాంటి మరో వినూత్నమైన సినిమాలో నటించాడు నాగ్.
ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మరో థ్రిల్లర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ‘బంగార్రాజు’ కోసం కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడు కాగా నాగ్ త్వరలోనే డిజిటల్ డెబ్యూ చేయబోతున్నాడన్నది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్.
ఒక ప్రముఖ ఓటీటీ కోసం నాగ్ వెబ్ ఫిలిమో.. లేదా వెబ్ సిరీసో చేయబోతున్నాడని జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్వయంగా నాగార్జునే దీనిపై స్పందించాడు. ఒక ఐడియా మీద వర్క్ చేస్తున్నామని.. అది ఓటీటీ కోసం చేయాల్సిన ప్రాజెక్టే అని.. చాలా కొత్తగా ఉంటుందని నాగ్ తెలిపాడు. అంతకుమించి ఈ ప్రాజెక్టు గురించి ఇప్పుడేమీ మాట్లాడలేనన్నాడు.
నాగ్ ఇలా అన్నాడంటే కచ్చితంగా త్వరలోనే ఆయన డిజిటల్ డెబ్యూ చూడబోతున్నామన్నామాటే. అదే తెలుగులో వెబ్ సిరీస్ లేదా వెబ్ ఫిలిం చేయనున్న తొలి స్టార్ హీరో నాగార్జునే అవుతారు. హిందీలో సైఫ్ అలీ ఖాన్, మనోజ్ బాజ్‌పేయి లాంటి ప్రముఖ నటులు వెబ్ సిరీస్‌లు చేశారు కానీ.. తెలుగులో స్టార్లు ఆ దిశగా అడుగులు వేయడానికి సందేహిస్తున్నారు.
హీరోయిన్లలో కాజల్, సమంత, తమన్నా, శ్రుతి హాసన్.. ఇలా చాలామందే ఈ బాట పట్టారు కానీ హీరోలు మాత్రం వెబ్ సిరీస్‌లు, ఫిలిమ్స్ చేయడాన్ని తక్కువగా చూస్తున్నారు. ఐతే నాగ్ ఈ దిశగా అడుగులేసి ఆ దృక్పథాన్ని మార్చేస్తాడనడంలో సందేహం లేదు.