తెలుగు సినీ నిర్మాతల కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి థియేటర్లో విడుదలైన భారీ చిత్రాలు పదివారాల తర్వాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్మాతల మండలి నిర్ణయించింది. ఈ క్రమంలో తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరగ్గా, తుది నిర్ణయాన్ని కమిటీకి వదిలేశారు.
అయితే, అనూహ్యంగా నిర్మాతల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల కార్యవర్గ సమావేశంలో చర్చించిన 8 కీలక అంశాలపై పలు నిర్ణయాలు తీసుకున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలను 10 వారాల తర్వాతే ఓటీటీ కి ఇవ్వాలి.
పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన చిత్రాలు 4 వారాల తర్వాత ఓటీటీకి ఇవ్వవచ్చు. రూ.6కోట్లలోపు బడ్జెట్ చిత్రాలపై ఫెడరేషన్తో చర్చించాక తుది నిర్ణయం తీసుకోవాలి. సినిమా ప్రదర్శనకు వీపీఎఫ్ (వర్చువల్ ప్రింట్ ఫీజు) ఛార్జీలు ఎగ్జిబిటర్లే చెల్లించాలి.
సినిమా టికెట్ ధర సామాన్యులకు అందుబాటులో ఉంచాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతిపాదించింది. నగరాలు, పట్టణాల్లో సాధారణ థియేటర్లు, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.100, రూ.70(జీఎస్టీతో కలిపి)గా ఉంచాలని ప్రతిపాదించారు.
ఇక మల్టీప్లెక్స్‌లో జీఎస్టీతో కలిపి రూ.125 ఉండేలా ప్రతిపాదనలు చేశారు. మీడియం బడ్జెట్, మీడియం హీరో సినిమాలకు టికెట్ ధర నగరాలు/పట్టణాల్లో రూ.100 ప్లస్ జీఎస్టీ ఉండాలని, అదే సి-సెంటర్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) ఉండాలని, మల్టీప్లెక్స్‌లో అత్యధికంగా రూ.150 ప్లస్ జీఎస్టీతో మాత్రమే ఉండాలని ప్రతిపాదించారు.
అన్నపూర్ణా స్టూడియోలో ప్రొడ్యూసర్స్ గిల్డ్ సమావేశం జరిగింది. చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాతలందరూ ఈ సమావేశానికి హాజరై సినీ ఇండస్ట్రీలోని వివిధ సమస్యలపై చర్చించారు. నిర్మాతల మండలి నిర్ణయాలు, బడ్జెట్ నష్టాలు, ఓటీటీలో విడుదలపై గంటపాటు చర్చ జరిగింది.
ఈ క్రమంలో ఆగస్టు 1 నుంచి సినిమా చిత్రీకరణలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. సినిమా చిత్రీకరణలు నిలిపివేసి సమస్యలపై నిర్మాతలంతా కలిసి చర్చించాలని తీర్మానం చేశారు.
Comments 1