చర్యకు ప్రతిచర్య పక్కా. ఆ విషయంలో మరో మాటకు తావు లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి సరికొత్త మార్గదర్శకాల్ని తీసుకొస్తూ నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు అంతిమంగా ప్రభావం పడేది స్టార్ హీరోలు.. హీరోయిన్లు.. నటులకే. ఇంతకాలం తాము అనుభవించిన రాజభోగాలు ఒక్కసారిగా మాయమైతే వారి మాటేమిటి? అన్నదే ప్రశ్న. తాజాగా తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత కీలకమైనది.
స్టార్ హీరో కావొచ్చు స్టార్ హీరోయిన్ కావొచ్చు. వారికిచ్చే రెమ్యునరేషన్ లో అన్ని ఖర్చులు కలిసి ఉంటాయి. దీంతో.. వారి వెంట ఉండే సిబ్బందికి స్టార్ వసతులను కూడా సదరు నటుడు.. నటినే చూసుకోవాల్సి ఉంటుంది. టాలీవుడ్ లో అగ్ర నటీమణుల్లో ఒకరిగా వెలిగిపోయే నటి.. తనతో పాటు తెచ్చుకునే సిబ్బంది అరడజనుకు పైనే ఉంటుంది. ఆమె సినిమాకు ఓకే చేయాలంటే.. ఆమె ఏ స్టార్ హోటల్లో అయితే బస ఇస్తారో.. అదే హోటళ్లోనే తన సిబ్బందికి బస ఇవ్వాలన్నది మొదటి కండీషన్.
అంతేకాదు.. తాను వాడే కారుకు కాస్త అటు ఇటుగా ఉండే లగ్జరీ కారునే సిద్ధం చేయాల్సి ఉంటుంది. షూటింగ్ ప్లేస్ లోనూ.. తన సిబ్బందికి ప్రత్యేక భోజనం ఇవ్వాలి. ఇన్ని లగ్జరీలు తాజాగా తీసుుకున్న నిర్ణయంతో గాల్లో కలిసిపోతాయి. ఈ ఖర్చుల మోత మొత్తం స్టార్ నటీనటులే భరించాల్సి ఉంటుంది. నిర్మాతల వరకు తాము తీసుకున్న నిర్ణయంతో ఖర్చుల పోటు నుంచి తప్పించుకున్నట్లుగా చెబుతున్నా.. ప్రాక్టికల్ గా ఎంతవరకు వర్కువుట్ అవుతుందన్నది అసలు ప్రశ్న.
గతానికి భిన్నంగా స్టార్ నటులు పలువురు.. ఏ రోజుకు షూటింగ్ కు వస్తే.. అదే రోజు తాము అనుకున్న భారీ మొత్తాన్ని తీసుకెళ్లటం ఒక అలవాటుగా మారింది. ఇప్పుడు అందుకు భిన్నంగా రెమ్యునరేషన్ ఇంత అనుకుంటే.. అంత మొత్తాన్నే చెల్లిస్తారు.రోజువారీ చెల్లింపులతో పోలిస్తే..ఒకటే మొత్తం ఇబ్బందికరంగా మారుతుంది. తెలుగు సినిమాను బతికించుకోవటం కోసం ఏం చేస్తే బాగుంటుంది? ఎలా వ్యవహరిస్తే ఖర్చుల షాకుల నుంచి తప్పించుకోవచ్చన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరిపి తీసుకున్న నిర్ణయాలు వినేందుకు బాగానే ఉన్నా.. ఆచరణలో ఇవి ఎంతమేర వర్కువుట్ అవుతాయన్నది అసలు ప్రశ్న.
ఎందుకంటే.. మార్గదర్శకాల్ని తూచా తప్పక పాటిస్తే.. సదరు నిర్మాతతో కంటే.. తమకు తగ్గట్లుగా ఓకే అనే నిర్మాతకు స్టార్ నటీనటులు ఓకే చెప్పే అవకాశం ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అయితే.. ఈసారి నిర్మాతలంతా ఒకే కట్టు మీద ఉంటారని చెబుతున్నారు. నిర్మాతలు అంతలా ఒకే మాట మీద ఉంటే.. స్టార్ హీరో హీరోయిన్ల రియాక్షన్ ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.