ఒక్కొక్కరి స్టైల్ ఒక్కోలా ఉంటుంది. అది రాజకీయ రంగమైనా.. సినిమా రంగమైనా. అయితే.. ఇప్పటివరకు ఆవేశంతోనో.. భావోద్వేగంతోనో నిర్ణయాలు తీసుకునే సినీ నటుల్ని ఇంతకాలం చూశాం. మొదటిసారి అందుకు భిన్నంగా ఆలోచన.. ఆవేశం.. అంతకు మించిన పక్కా వ్యూహం.. లాంటి అన్ని గుణాలకు అదనంగా మేధోపరంగా మిగిలిన వారి కంటే మిన్నగా ఉండే ప్రకాశ్ రాజ్ సమ్ థింగ్ స్పెషల్ అని చెప్పాల్సిందే.
‘మా’ ఎన్నికల వేళ ఆయన అనుసరించిన వైనం.. వేస్తున్న ఎత్తులు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. ఎప్పటికప్పుడు భిన్నంగా ఉండటమే.. రోటీన్ కు భిన్నంగా ఉంటున్నాయని చెప్పాలి.
తాను ‘మా’ ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రకాశ్ రాజ్ ప్రకటించినంతనే చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. లోకల్ .. నాన్ లోకల్ లాంటి అవసరం లేని వివాదం తెర మీదకు రావటమే కాదు.. షూటింగ్ వేళ ఆయన వ్యవహారశైలి ఎలా ఉంటుంది? టైమిచ్చిన తర్వాత పట్టించుకోరన్న మాటతో పాటు.. ఆయన వామపక్షవాది అని.. హిందుత్వానికి వ్యతిరేకుడని.. ఇలా బోలెడన్ని వాదనలు తెర మీదకు వచ్చాయి.
తన వాదనను బలంగానే వినిపించినప్పటికీ.. విష్ణు వర్గం మాదిరి పోల్ మేనేజ్ మెంట్ విషయంలో దూకుడుగా వ్యవహరించేందుకు ప్రకాష్ రాజ్ విముఖత ప్రదర్శించారని చెబుతున్నారు. అంతేకాదు.. తాను చెప్పే సిద్ధాంతానికి బిన్నంగా ఓట్లను వేయించుకుంటే.. తన సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు మీద దెబ్బ పడటంతో పాటు.. వేలెత్తి చూపించే వారు ఎక్కువ అవుతారన్న ఉద్దేశంతో పరిమితమైన పోటీకి మాత్రమే ఆయన ఆసక్తి చూపించారని చెబుతారు.
తన వైరి వర్గం.. పోలింగ్ రోజున ఓట్లు వేయించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయటం.. భారీగా బలగాల్ని వేర్వేరు ప్రాంతాలనుంచి తీసుకువచ్చినట్లుగా ఆరోపణలు వ్యక్తమైనా.. తాను మాత్రం టికెట్లు బుక్ చేయటం.. హోటళ్లలో బస ఏర్పాట్లు చేయటం లాంటివి జరుగుతున్నా.. అలాంటి వాటికి దూరంగా ఉన్నట్లు చెబుతారు. ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన వేళలోనే.. ఎలాంటి భావోద్వేగాలకు గురికాలేదు.
ఫలితాలు వెలువడిన రెండో రోజు సాయంత్రం.. తన టీంతో ప్రెస్ మీట్ పెట్టిన ఆయన.. పోలింగ్ రోజున పోలింగ్ గదుల్లో ఏం జరిగిందన్న విషయాన్ని గెలిచిన సభ్యుల చేత చెప్పింది.. తమ పదవులకురాజీనామా చేయించటం ద్వారా ప్రకాశ్ రాజ్ మంచు వర్గానికి మాస్టర్ స్ట్రోక్ కొట్టారన్న మాట ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.
ప్రకాష్ రాజ్ తీరు చూస్తే.. మోహన్ బాబు ఆవేశాన్ని తన ఆలోచనలతో దెబ్బ తీయాలన్నట్లుగా ఉన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో తాను చెప్పే సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరించకూడదన్న పట్టుదలతో ఉన్నారంటారు.
అందుకు తగ్గట్లే.. ఆయన వ్యవహారశైలి ఉంటుంది. ‘మా’ పోలింగ్ రోజున మోహన్ బాబు తమను బండ బూతులు తిట్టినా మౌనంగా ఉన్న వైనం చూస్తే.. ఇదంతా ప్రకాశ్ రాజ్ వ్యూహంగా చెబుతున్నారు. గొడవపడి గెలవలేమన్న విషయాన్ని గుర్తించి.. అందుకు భిన్నంగా మోహన్ బాబు ఆవేశాన్ని ఆయనకే అనర్థంగా మార్చే వ్యూహంలో ఆయన ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇందుకు తగ్గట్లే.. పోలింగ్ రోజున సీసీ కెమేరా ఫుటేజ్ ను తాజాగా అడగటం.. దాన్ని తీసుకొని న్యాయపోరాటానికి వెళ్లనుండటం చూస్తే.. ప్రకాశ్ రాజ్ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేట్టుగా లేరన్న విషయం అర్థం కాక మానదు.
పోలింగ్ వేళ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన విషయాల్ని సరైన రీతిలో చర్చకు తీసుకురావటం.. న్యాయపోరాటానికి వెళ్లాలన్న పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. ప్రకాశ్ రాజ్ తీరు చూస్తే.. గొడవ పడరు అలా అని గమ్మున ఉండరన్నట్లుగా ఆయన తీరు ఉందని చెప్పక తప్పదు, మొత్తానికి ‘మా’ ఎన్నికల చిచ్చు ఇప్పట్లో ఆరేట్లుగా కనిపించట్లేదు. రానున్న రోజుల్లో మరిన్ని పరిణామాలు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.