‘‘ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలని.. మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నామండీ’’
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి అంతటి వాడు ఇలా నిజంగానే చేతులు జోడించి వేడుకుంటూ ఈ మాటలు అనడం ఆయన అభిమానులనే కాదు.. అందరినీ ఆవేదన గురించి చేసిన మాట వాస్తవం.
చిరంజీవి అంటే నచ్చని వాళ్లకు సైతం ఆ దృశ్యం చూస్తే ఏదోలా అనిపించే ఉంటుంది. చిరంజీవి స్థాయికి ఈ దేబిరింపు ఏమిటి అన్న భావన కలిగి ఉంటుంది. ఐతే చిరు లాంటి దిగ్గజం ఇలా చేతులు జోడిరచి అడుగుతుంటే.. జగన్ హావభావాలు గమనించారా?
ఒక నటుడిగా చిరు స్థాయి ఏంటో జగన్‌కు తెలియంది కాదు. వయసులో ఆయన పెద్ద వ్యక్తి. రాజకీయంగా చూసుకున్నా కూడా తనకంటే సీనియర్. ఆ స్థాయి వ్యక్తి చేతులు జోడిరచి అడుగుతుంటే.. మీరు పెద్ద వారు అలా దండం పెట్టకండి అని వారించడం కానీ.. మీరు అంతగా అడగాలా కచ్చితంగా చేస్తా అనడం కానీ ఏమైనా చేశాడా? ఏమీ లేదు.
ఒక్కసారి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అదే కుర్చీలో ఊహించుకుని చూడండి. చిరు సహా సినీ ప్రముఖులతో ఆయనైతే ఇలాగే వ్యవహరించేవారా? అసలు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటే సినీ పరిశ్రమకు ఇలాంటి సంక్షోభ స్థితిని ఎదుర్కొనేదా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం సందర్భంగా చిరు సహా సినీ ప్రముఖులంతా ఎంత అణిగి మణిగి ఉన్నారో అంతా చూశారు. టికెట్ల ధరల సమస్యను పరిష్కరించాలంటూ అందరూ ఆయన్ని వేడుకున్నంత పని చేశారు.
అలాగే ముఖ్యమంత్రిని పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. అంతటితో ఆగకుండా బయటికి వచ్చి మీడియా ముందు జగన్‌ను కీర్తించారు. ఆ తర్వాత ట్విట్టర్లో కూడా ఎవరికి వాళ్లు వ్యక్తిగతంగా ఏపీ సీఎంను కొనియాడుతూ, ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ పోస్టులు పెట్టారు. ఇంత చేసినా ఇంకా టికెట్ల ధరల సవరణ వెంటనే జరగలేదు. పవన్ సినిమా రిలీజయ్యే వరకు తొక్కిపెట్టారు. ఆ తర్వాత ఇప్పటికీ కొత్త జీవోతో సినిమా వాళ్లు హ్యాపీగా లేరు. ఎందుకంటే ఏపీలో 20 శాతం సినిమా తీయాలట. వంద కోట్ల బడ్జెట్ ఉండాలట. ఇది అయ్యేపనేనా. భారీ సినిమా తీస్తున్నపుడు కథకు అనుగుణంగా లొకేషన్ చూస్తారు గాని జగన్ నిర్ణయాల కోసం రాజీపడతారా?
ఇదిలా ఉంటే.. ఈ సినీ ప్రముఖులతో పాటు మంత్రి పేర్ని నాని సహా అందరూ సమస్యను జగన్ అర్థం చేసుకున్నట్లు, పరిష్కారానికి చొరవ చూపిస్తున్నట్లుగా చెబుతూ వచ్చారు. కానీ అసలు ‘సమస్య’ అనేది ఎలా మొదలైంది అన్నది ఇక్కడ ప్రాథమికమైన ప్నశ్న. లేని సమస్యను సృష్టించిందే జగన్ ప్రభుత్వం. తర్వాత ఆ సమస్యను పెంచి పెద్దది చేసిందీ వాళ్లే. ఇప్పుడు పరిష్కరించేది కూడా వాళ్లేనట. ఇదే ఈ మొత్తం వ్యవహారంలో అతి పెద్ద కామెడీ.
ఎలా మొదలైంది?
అసలు ఏపీలో టికెట్ల ధరల సమస్య ఎలా, ఎప్పుడు మొదలైందన్నది కీలకమైన విషయం. ఇన్నేళ్లలో ఎన్నడూ లేని టికెట్ల ధరల సమస్య మొదలైందే పది నెలల కిందట. ఆ పుణ్యమంతా జగన్ సర్కారుదే. ఓవైపు మిగతా అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పెట్రోల్ వంటి వాటి మీద ఎలా పన్నులేసి జనాలను పీడిస్తున్నారో తెలిసిందే. అలాంటిది టికెట్ల రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయంటూ వాటి మీద నియంత్రణ తెచ్చింది జగన్ సర్కారు.
ఏళ్ల నాటి జీవోను తీసుకొచ్చి 10కి, 20కి టికట్లెూ అమ్మాలంటూ హుకుం జారీ చేశారు. నిజానికి జగన్ రాజకీయ ప్రత్యర్థి అయిన పవన్ కళ్యాణ్‌ను దెబ్బ కొట్టాలన్న లక్ష్యంతో గత ఏడాది వేసవిలో ‘వకీల్ సాబ్’ సినిమాకు ఉన్నట్లుండి టికెట్ల రేట్లు తగ్గించేసి పైశాచిక ఆనందం పొందింది జగన్ సర్కారు. ముందు పవన్నే టార్గెట్ చేసినా.. ఆ తర్వాత ఆ సమస్య కాస్తా ఇండస్ట్రీ మెడకు చుట్టేసుకుంది.
పవన్‌ను ఒక్కడినే ఇబ్బంది పెడితే సరిపోదనుకుందో ఏమో కానీ.. జగన్ సర్కారు ఆ తర్వాత మొత్తం ఇండస్ట్రీనే వేధించడం మొదలుపెట్టింది. టికెట్ల రేట్లు తగ్గించడమే కాక.. కేవలం సినిమాలను దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో నైట్ కర్ఫ్యూ పెట్టి సెకండ్ షోలు రద్దు చేయించడం.. ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించడం లాంటివి చేసింది.
తాను ముఖ్యమంత్రి అయ్యాక సినిమా వాళ్లెవ్వరూ తనకు సరైన గౌరవం ఇవ్వట్లేదని.. శుభాకాంక్షలు చెప్పడం.. తనకు సన్మానాలు చేయడం లాంటివి చేయడకపోవడంతో తనను వాళ్లంతా సీఎంగా గుర్తించట్లేదనే భావనలో జగన్ ఉన్నట్లు చెబుతారు. ఈ నేపథ్యంలోనే ఈ టికెట్ల రేట్ల అంశాన్ని పట్టుకుని దాన్నో పెద్ద సమస్యగా మార్చి.. మొత్తం ఇండస్ట్రీ తనకు సాగిల పడేలా చేయాలనుకున్నారు. ఐతే ఆయన లక్ష్యం కొంతమేర నెరవేరింది.
చిరంజీవి, దిల్ రాజు సహా కొందరు ప్రముఖులు ఆయన శరణుజొచ్చారు. అయినా జగన్‌కు సంతృప్తి దక్కలేదు. మరిందరు ప్రముఖులు తనను కలిసి సమస్య పరిష్కారం కోసం విన్నపాలు చేస్తే చూడాలనుకున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ లాంటి సెలబ్రెటీలు ఇటీవల చిరంజీవితో కలిసి వెళ్లి చిరంజీవిని కలిశారు. అందరూ ఏపీ సీఎంను పొగడ్తల్లో ముంచెత్తారు. సమస్య పరిష్కారం కోసం విన్నవించుకున్నారు. అలాగే ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ట్వీట్లు వేశారు. ఇప్పుడు జగన్ అహం కొంత చల్లారినట్లే కనిపిస్తోంది.
బాబు హయాంలో గుర్తుందా?
ఏపీ సీఎం జగన్‌ను చిరంజీవి చేతులు జోడిరచి వేడుకున్నాక.. సోషల్ మీడియాలో ఒక మీమ్ తెగ వైరల్ అయింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ‘మేము సైతం’ అనే ఈవెంట్లో చంద్రబాబుతో సరదాగా జోకులేస్తూ చిరు మాట్లాడుతున్నప్పటి ఫొటో అది. దాని పక్కనే జగన్‌ను చేతులు జోడిరచి వేడుకుంటున్న ఫొటోను పెట్టారు. ఈ రెండు ఫొటోలు చూస్తే అప్పటికి, ఇప్పటికి సినిమా వాళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థమైపోతుంది.
అలాగే చంద్రబాబుకు, జగన్‌కు మధ్య వ్యత్యాసానికి కూడా ఇదే నిదర్శనం. సినిమా వాళ్లను చంద్రబాబు ఎన్నడూ ఇబ్బంది పెట్టింది లేదు. వాళ్లకు ఏం కావాలంటే అది ఇచ్చారు. పెద్ద సినిమాలకు డిమాండును బట్టి వారం వరకు టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించారు. అదనపు షోలకు అడిగిందే తడవుగా అనుమతులిచ్చారు. బెనిఫిట్ షోలకు ఎన్నడూ ఇబ్బంది లేదు.
అలాగే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సినిమా ఇండస్ట్రీకి అనుకూలంగానే వ్యవహరించారు. ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక కూడా అదే రీతిలో సహకరించారు. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేశారు. కానీ జగన్ వచ్చాక జరిగిందేంటో అందరికీ తెలుసు. జగన్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతుగా నిలిచిన వాళ్లు సైతం ఇప్పుడు ఇబ్బంది పడుతున్న సంగతి అందరికీ తెలుసు. మంచు ఫ్యామిలీ హీరోలతో పాటు అందరూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కానీ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేక సైలెంటుగా ఉన్నారు.
చంద్రబాబునైతే మాత్రం ఎవరైనా ఎన్ని మాటలైనా అనేస్తారు. ఎందుకంటే ఆయనకు కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం.. అధికార మదంతో అవతలి వాళ్లను ఇబ్బంది పెట్టి పైశాచిక ఆనందం పొందడం లాంటివి అలవాటు లేదు కదా. కాబట్టే రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ అడ్డదిడ్డమైన సినిమా తీసినా ఏమీ అనలేదు. ఆ సినిమా రిలీజ్‌కు అడ్డు పడలేదు. ప్రజాస్వామ్యానికి, వాక్ స్వాతంత్య్రానికి ఆయనిచ్చిన విలువ అది.
స్టూడియోలు కట్టాలట
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి ఎలా పడకేసిందో అందరికీ తెలుసు. కొత్తగా పరిశ్రమలు పెట్టడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి దుకాణం సర్దేసే పరిస్థితి నెలకొంది. ఏపీ మీద శాశ్వతంగా ఒక నెగెటివ్ ముద్ర పడిపోతోంది. ఇంటా బయటా పరువు పోతున్నా జగన్ సర్కారుకు ఇదేమీ పట్టట్లేదు.
ఐతే వాస్తవం ఇలా ఉంటే.. సినిమా వాళ్లతో మీటింగ్ సందర్భంగా జగన్ చిలక పలుకులు పలికారు. సినీ పరిశ్రమను హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి తరలించాలట. అక్కడే వచ్చి షూటింగులు చేయాలట. స్టూడియోలు కట్టాలట. ఇండస్ట్రీ జనాలందరికీ ఇళ్ల స్థలాలిస్తారట. అక్కడికొచ్చేసి ఇళ్లు కట్టుకోవాలట.
అసలు ఇండస్ట్రీ హైదరాబాద్‌లో ఉండగానే ఇంతగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి.. ఇక పరిశ్రమను అక్కడికి తరలిస్తే ఇంకెలా ఇబ్బంది పెడతాడో,.. ఆయన సహా వైసీపీ నాయకులు ఎలా బ్లాక్ మెయిల్ చేస్తారో సినీ జనాలకు తెలియందా. అందుకే మరి ఆ మీటింగ్ వరకు ఊ కొట్టేసి బయటికొచ్చి ఈ వ్యాఖ్యల మీద జోకులు వేసుకున్నారట సినీ జనాలు. ఐతే ఇప్పటికైనా తమను నెత్తిన పెట్టుకుందెవరో.. కింద వేసి తొక్కిపడేస్తున్నదెవరో అర్థం చేసుకుని తాము ప్రత్యక్షంగా అయినా, పరోక్షంగా అయినా ఎలాంటి నాయకులకు మద్దతుగా నిలవకూడదో తెలుసుకుంటే మంచిది.