కరోనా మహమ్మారి తెచ్చిపెట్టిన కష్టాలు, నష్టాలు అన్నీ ఇన్నీ కావు. అదే సమయంలో ఇది కొన్ని జీవిత పాఠాలు కూడా నేర్పిన మాట వాస్తవం. మానవ సంబంధాల విలువను కొవిడ్ తెలిసేలా చేసిందని.. కుటుంబంతో కలిసి ఎక్కువ సమయం గడిచే అవకాశం ఇచ్చిందని.. దీని గురించి సానుకూలంగా మాట్లాడారు విశ్లేషకులు.
ఐతే పనులు మానుకుని ఇంట్లో కుటుంబ సభ్యులతో గడపడం మంచితో పాటు చెడు కూడా చేసిందా అనిపించేలా ఉదంతాలు చోటు చేసుకుంటుండటమే విచారకరం. మునుపెన్నడూ లేని విధంగా విడాకుల కేసులు పెరిగిపోతుండటమే ఇందుకు సూచిక.
బాలీవుడ్లో ఆమిర్ ఖాన్-కిరణ్ రావు సహా చాలా జంటలు కరోనా టైంలోనే విడిపోయాయి. టాలీవుడ్లో నాగచైతన్య-సమంతల జంట గురించి తెలిసిందే. ఇటీవలే మరో జంట విడాకుల ప్రకటనతో పెద్ద షాకిచ్చింది. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య, ఆమె భర్త ధనుష్ తాము విడిపోతున్నట్లు ప్రకటించారు.
ధనుష్ స్వతహాగా గొప్ప నటుడే అయినా.. స్వశక్తితోనే హీరోగా నిలదొక్కుకున్నా.. రజినీ అల్లుడయ్యాక అతడి రేంజ్ మారింది. ఐశ్వర్యతో అతడికి మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్లే కనిపించేవాడతను. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాంటిది 18 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించాలని ఇద్దరూ నిర్ణయంచుకోవడం అభిమానులకు ఏమాత్రం రుచంచలేదు.
మరోవైపు టాలీవుడ్లో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్, అతడి భార్య లత కూడా విడిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నడూ లేనిది ఇప్పుడే ఈ విడాకుల వార్తలు ఎక్కువగా వస్తుండటంతో దీనికంతటికి కరోనా పరోక్ష కారణమా.. అది తెచ్చిన మానసిక ఒత్తిడికి తోడు.. తమ భాగస్వాములతో ఎక్కువ సమయం గడిపే క్రమంలో విభేదాలు తలెత్తి విడిపోతున్నారా అన్న చర్చ నడుస్తోందిప్పుడు.