నాగ్ అశ్విన్ అంటే వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుపోయే దర్శకుడిగా పేరుంది టాలీవుడ్లో. ఐతే తాజాగా అతను పెట్టిన ఒక పోస్టు సోషల్ మీడియాలో పెద్ద దుమారానికే దారి తీసింది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. ఎలాంటి అశ్లీలత, రక్తపాతం లేకుండా సినిమా తీసి ఇంతటి విజయం సాధించడం ఎక్కువ సంతృప్తిని ఇస్తోందని నాగ్ అశ్విన్ పేర్కొన్నాడీ పోస్టులో. అతను ఎవరి పేర్లూ ప్రస్తావించకపోయినా.. సందీప్ రెడ్డి వంగను టార్గెట్ చేస్తూనే ఈ పోస్ట్ పెట్టాడనే అభిప్రాయం సామాజిక మాధ్యమాల్లోకి బలంగా వెళ్లిపోయింది.
‘యానిమల్’ సినిమా మీద పరోక్షంగా అతను కౌంటర్లు వేశాడని చర్చించుకుంటున్నారు. ఈ పోస్టుతో అంతిమంగా నాగి ఏం సాధించాడనే ప్రశ్న తలెత్తుతోంది. అతడికి మద్దతుగా పెద్దగా స్పందనేమీ కనిపించలేదు. ఎక్కువగా నెగెటివిటీనే కనిపించింది. సందీప్ రెడ్డి టాలీవుడ్ దర్శకుడు. ఇక్కడ్నుంచి వెళ్లి బాలీవుడ్లో జయకేతనం ఎగురవేశాడు. బాలీవుడ్ వాళ్లను రెండు సినిమాలతో బెంబేలెత్తించాడు. తన సినిమాలు కొంచెం బోల్డ్‌గా ఉంటాయి. కథను అనుసరించి హింస ఎక్కువ ఉండొచ్చు.
కొన్ని సన్నివేశాలు అసభ్యంగా అనిపించి ఉండొచ్చు. కానీ వాటి వల్లే తన సినిమాలు ఆడాయా అన్నది ప్రశ్న. తన స్టైల్ ఆఫ్ మేకింగ్ అలా ఉంటుంది. కానీ వాటి వల్లే వందల కోట్లు వసూళ్లు వచ్చేయలేదన్నది గమనించాలి. బాలీవుడ్ వాళ్లు తన మీద అక్కసుతో ఎన్నో కామెంట్లు చేశారు. వాటన్నింటికీ సందీప్ సమాధానం కూడా ఇచ్చాడు. కానీ ఒక టాలీవుడ్ దర్శకుడు బాలీవుడ్లో వెళ్లి జెండా ఎగురవేస్తే.. టాలీవుడ్ వాళ్లు అతడి మీదే కౌంటర్లు వేసి వెనక్కి
లాగాలని చూడడం కరెక్టా అనే ప్రశ్నను నెటిజన్లు నాగికి సంధిస్తున్నారు.
‘కల్కి’లో అమితాబ్, కమల్, దీపిక లాంటి టాప్ స్టార్లు ఉన్నారు. రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు. హాలీవుడ్ సినిమాల నుంచి అనేక సన్నివేశాలు స్ఫూర్తి పొందారు. కానీ సందీప్ ఇవేమీ లేకుండా కేవలం తన స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో మిడ్ రేంజ్ హీరోను పెట్టి 900 కోట్ల సినిమాను అందిస్తే దాని మీద సెటైర్లేంటి అంటూ నాగిని నిన్నట్నుంచి సందీప్ మద్దతుదారులు గట్టిగానే తగులుకుంటున్నారు. దీని వల్ల నాగికి బాగానే డ్యామేజ్ జరిగినట్లు కనిపిస్తోంది.