కేఎస్ నాగేశ్వరరావు.. ఈ పేరు ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ.. 2000 ప్రాంతంలో రెగ్యులర్‌గా సినిమాలు చూసిన వాళ్లుక ఈ పేరు బాగానే తెలుసు. శ్రీహరి హీరోగా నిలదొక్కుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఈ దర్శకుడు హఠాత్తుగా కన్నుమూయడం తెలుగు సినీ పరిశ్రమను విషాదంలో నింపింది.
కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నాగేశ్వరరావు.. తాజాగా తన స్వస్థలం అయిన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు వెళ్లి తిరిగి హైదరాబాద్‌కు వస్తూ మార్గ మధ్యంలో మృతి చెందారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న ఆయనకు మార్గ మధ్యంలో ఫిట్స్ వచ్చాయట.
కోదాడ సమీపంలో అపస్మారక స్థితికి చేరుకున్న నాగేశ్వరరావును స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో అక్కడి నుంచి ఏలూరుకు తీసుకెళ్లారు. కానీ ఈలోపే ఆయన తుది శ్వాస విడిచినట్లు తెలిసింది.
కె.ఎస్.నాగేశ్వరరావుకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. యాక్షన్ కథలకు ఎమోషన్ జోడించి.. పరిమిత బడ్జెట్లో సినిమా చక్కగా తీయగలడని నాగేశ్వరరావువు అప్పట్లో మంచి పేరుండేది. సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర శిష్యరికం చేసిన నాగేశ్వరరావు కృష్ణం రాజు హీరోగా తెరకెక్కించిన ‘రిక్షా రుద్రయ్య’తో దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఆ తర్వాత దివంగత నటుడు శ్రీహరి విలన్, క్యారెక్టర్, కామెడీ రోల్స్‌కే పరిమితమైన రోజుల్లో అతణ్ని ‘పోలీస్’ సినిమాతో హీరోను చేసింది నాగేశ్వరరావే. ఆ సినిమా సెన్సేషనల్ హిట్టయి శ్రీహరి రాత మార్చింది. ఆ తర్వాత ఇదే హీరోతో సాంబయ్య, శ్రీశైలం లాంటి సినిమాలు రూపొందించారు.
ఇవి రెండు కూడా బాగానే ఆడాయి. తర్వాత నాగేశ్వరరావుకు సరైన విజయాలు దక్కలేదు. దేశద్రోహి, వైజయంతి లాంటి సినిమాల తర్వాత ఆయన తెరమరుగయ్యారు.