బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ కలకలం సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతోంది. ముందస్తు సమాచారంతో టాస్క్‌పోర్స్ పోలీసులు నిర్వహించిన డెకాయ్ ఆపరేషన్ లో దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జరిపిన దాడుల్లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, మెగా డాటర్ కొణిదెల నిహారికలతో పాటు పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల పిల్లలు పట్టుబడ్డారని ప్రచారం జరుగుతోంది.
అయితే, ఈ పబ్ లో జరిగిన దాడుల్లో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నారని ఓ మీడియా ఛానెల్ కథనం ప్రసారం చేసింది. దీంతో, ఆ ఛానెల్ పై హేమ మండిపడ్డారు. తన గురించి అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని, అందుకే సదరు మీడియా సంస్థలపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఆమె బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సదరు మీడియా సంస్థపై హేమ ఫైర్ అయిన హేమ…అక్కడ రచ్చ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఫిర్యాదు చేసేందుకే వచ్చానని అన్నారు. ఇంత పెద్ద కేసులో తన పేరును ఇన్వాల్స్ చేసి.. బద్నాం చేస్తున్నారని, ఒక మహిళపై ఈ విధమైన ప్రచారం సరికాదని చెప్పారు.
ఈ కేసులో అనవసరంగా తన పేరును ప్రస్తావిస్తున్నారని, ఏ సంబంధం లేని తన పేరును ఓ మీడియా చానెల్ ప్రసారం చేసిందని మండిపడ్డారు. అసలు తాను ఆ పబ్ కు వెళ్లలేదని అన్నారు. ఆ సమయంలో మీరెక్కడున్నారని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు…తాను ఇంట్లోనే ఉన్నానని హేమ సమాధానమిచ్చారు. అనవసరంగా కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని తనపై అభాండాలు వేస్తూ తన పేరును ప్రసారం చేస్తున్నాయని హేమ ఆరోపించారు. ప్రముఖులు, వారి పిల్లలను వదిలేసి తనపై నిందలు మోపడమేంటని ప్రశ్నించారు.