సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారక రత్న హఠాన్మరణంతో టాలీవుడ్ లో కొద్ది రోజుల క్రితం విషాదం అలుముకున్న సంగతి తెలిసిందే. యువకుడైన తారక రత్న సినీరంగంలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుబెట్టి 9 hours అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత కూడా కొన్ని ప్రాజెక్టులలో నటిస్తున్న సమయంలో తారకరత్న హఠాన్మరణం పాలయ్యారు. ఆ విషాదం నుంచి టాలీవుడ్ తేరుకోక ముందే తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం జరిగింది.
టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత కాస్ట్యూమ్ కృష్ణ తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. కాస్ట్యూమ్ కృష్ణ మృతిపట్ల టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాస్ట్యూమ్ కృష్ణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నిర్మాత దిల్ రాజు ట్వీట్ చేశారు.
విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోటలో పుట్టిన కాస్ట్యూమ్ కృష్ణ…అసిస్టెంట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్ బంద్’ సినిమాతో ఆయన నటుడిగా పరిచయమయ్యారు. పెళ్లి పందిరి సినిమాను నిర్మించి నటించారు. కృష్ణ, ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవి లాంటి స్టార్ హీరోలకు, వాణిశ్రీ, జయసుధ, జయప్రద, శ్రీదేవి లాంటి హీరోయిన్లకు ఆయన కాస్ట్యూమ్స్ అందించారు.
ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించడమే కాకుండా…పలు చిత్రాలలో విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన శైలిలో పాత్రలను పోషించి ప్రేక్షకులను మెప్పించారు. పెళ్లాం చెబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి తదితర సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.