టాలీవుడ్ లో తీవ్ర విషాదం ఏర్పడింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడిగా పేరున్న ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. శనివారం ఉదయం 9:45 నిమిషాలకు చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాదాపు 932 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించారు చంద్రశేఖర్. చంద్రమోహన్ కు భార్య జలంధర, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
చంద్రమోహన్ మృతిపై రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్ మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు అలవోకగా చంద్రమోహన్ పోషించారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని లోకేష్ అన్నారు.
ఇక, చంద్రమోహన్ మరణంపై మెగా స్టార్ చిరంజీవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన నటనా కౌశలంతో చంద్రమోహన్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారని, ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడం విషాదకరమని అన్నారు. తన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’తో తామిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది స్నేహంగా మారి గొప్ప అనుబంధం అయిందని గుర్తు చేసుకున్నారు.