ట్రాఫిక్ పోలీసుల ఓవరాక్షన్ కు ఓ పసి ప్రాణం బలైంది….చలానా కట్టాల్సిందేనంటూ కారును నడిరోడ్డుపై పట్టుబట్టడంతో పసికందు కన్నుమూశాడు…ఖాకీల కర్కశత్వంతో కన్నకొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది..పసివాడికి సీరియస్ గా ఉందని, హాస్పిటల్ కు వెళుతున్నామని చెప్పినా కనికరించకపోవడంతో కన్నపేగు తల్లడిల్లింది. వరంగల్– హైదరాబాద్ హైవేపై వంగపల్లి దగ్గర ట్రాఫిక్ పోలీసుల నిర్వాకంతో ఓ పసివాడు చనిపోయిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనగాం జిల్లా మరిగడి గ్రామానికి చెందిన మచ్చ మల్లేశం, సరస్వతి దంపతులకు ఇటీవలే కొడుకు పుట్టాడు. అనారోగ్యం బారిన పడ్డ ఆ పసివాడి పరిస్థితి సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. ఈ క్రమంలోనే వరంగల్– హైదరాబాద్ హైవేపై వంగపల్లి దగ్గర వారు బాడుగకు మాట్లాడుకొని వెళుతున్న కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ కారుపై రూ.1000 పెండింగ్ చలానా ఉందని, అది క్లియర్ చేసేంతవరకు కారును వదిలే ప్రసక్తే లేదని పోలీసులు తేల్చిచెప్పారు.
అయితే, బాబుకు సీరియస్ గా ఉందని, అర్జెంట్‌గా హైదరాబాద్ లో నీలోఫర్ ఆస్పత్రికి తీసుకెళుతున్నామని బతిమిలాడినా ఖాకీలు కనికరించలేదు. చివరకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి, చలానా క్లియర్ చేయించిన తర్వాత కారును విడిచిపెట్టారు. ఈ తతంగమంతా అరగంటకుపైగానే జరగడంతో వారు నీలోఫర్ ఆస్పత్రికి చేరుకునే సరికి బాబు చనిపోయాడు. దీంతో, యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీసులు కారును ఆపడం వల్లే తన కొడుకు చనిపోయాడని మీడియాకు బాబు తల్లి సరస్వతి తెలిపారు.
అరగంట ముందుగా తీసుకువస్తే బాబు బతికేవాడని డాక్టర్లు చెప్పారని కన్నీరుమున్నీరయ్యారు. తన కొడుకు చావుకు పోలీసులే కారణమని ఆమె ఆరోపించారు. బాబును హాస్పిటల్‌కు తీసుకువెళ్తున్న కారును ఆపలేదని, పెండింగ్ చలాన్లు ఉన్న అన్ని కార్లను ఆపి చలానా క్లియర్ చేయాలని డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టామని యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ సైదయ్య అంటున్నారు. బాబుకు సీరియస్ గా ఉందని, కారులో హాస్పిటల్ కు తీసుకెళ్తున్నామని ఎవరూ తమకు చెప్పలేదని, ఆ తల్లి ఆరోపణల్లో నిజంలేదని సైదయ్య చెప్పారు.