త్వరలోనే తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఇది అధికార పార్టీ వైసీపీకి సిట్టింగ్ స్థానం. పైగా అధికారంలో కి వచ్చిన ఏడాదిన్నర తర్వాత వచ్చిన ఉప ఎన్నిక కావడంతో తాము గొప్పగా చేస్తున్న పాలనకు ఇది `ఓ పరీక్ష` దీంతో ఇక్కడ మంచి మార్కులు వేయించుకుని.. భారీ మెజారిటీతో విజయం సాధించాలి. అంతేకాదు.. తాము సంకల్పించిన మూడు రాజధానులకు ప్రజా మద్దతు ఉందని చెప్పుకోవడానికి దీనిని వాడాలని వైసీపీ అనుకుంటోంది. దీంతో వైసీపీ సైలెంట్‌గానే ఇక్కడ పావులు కదుపుతోంది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. 10 రోజుల పెంపు వెనుక (టీటీడీ చరిత్రలో తొలిసారి తీసుకున్న నిర్ణయం) కూడా తిరుపతి ఉప పోరు ఉందని చెబుతున్నారు. ఇలా అనేక రూపాల్లో తిరుపతి ఉప పోరుపై పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది.
అయితే.. ఎన్ని వ్యూహాలు వేసినా.. ఈ పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిస్థితి మాత్రం పైకి చెప్పు కొంటున్న మాదిరిగా మాత్రం లేదు. ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ నాయకులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు అయినా కూడా.. నాలుగు నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు.. అసంతృప్తులు, పార్టీని తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇటీవల ఆయా ఏడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అధినేత నివేదిక తెప్పించుకున్నారు. ఈ క్రమంలో వెంకటగిరి, శ్రీకాళహస్తి, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల్లో నేతల పరిస్థితి దారుణంగా ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులకు మంచి మెజారిటీ వస్తే.. ఎంపీ అభ్యర్థి దివంగత బల్లి దుర్గాప్రసాదరావుకు మాత్రం తక్కువ మెజారిటీ వచ్చింది.
ఇక, ఇప్పుడు.. ఇక్కడ ఎమ్మెల్యేల వ్యవహార శైలితో పార్టీ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. గూడూరులో వరప్రసాద్ దూకుడు కారణంగా పార్టీలో కీలక నేతలు నియోజకవర్గానికి దూరమయ్యారు. దీంతో ఎన్నికల సమయంలో వీరు కలిసి వస్తారా? పైగా వరప్రసాద్ ప్రచారం చేసినా ప్రజలు ఆయనను పట్టించుకుంటారా? అనేది డౌటే. ఇక, వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయన మాటలను అధికారులే వినిపించుకోవడం లేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. దీంతో ఆయన కూడా పార్టీపై ఆగ్రహంతో ఉన్నారు. దీంతో ఆయన కూడా ప్రచారానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అధినేత ఆదేశాలతో ప్రచారం చేపట్టినా.. ముక్తసరిగానే వ్యవహరించనున్నారు.
సర్వేపల్లిలో బలమైన నాయకుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డికి గ్రూపుల రగడ వెంటాడుతోంది. ఆయనకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్‌రెడ్డి మాటలు ఎక్కువ పని తక్కువ.. అనే కామెంట్లు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ కూడా పార్టీకి వ్యతిరేకత పెరిగిందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇలా ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉండడంతో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై ఎలాంటి ప్రభావం పడుతోందనని వైసీపీ వర్గాల్లో కలవరం ప్రారంభమైంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
కొసమెరుపు – టీడీపీ అభ్యర్థి కాస్త కష్టపడితే కచ్చితంగా ఇది వైసీపీ చేజారే సీటే. కానీ స్వయంకృతాపరాధాలతో టీడీపీ మరోసారి నష్టపోయే అవకాశమూ లేకపోలేదు.