తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు ఎలా? సీఎం జగన్ దూకుడుకు బ్రేకులు వేసేదెలా? ఇప్పుడు ఇవే ప్రశ్న లు ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో అంతర్మథనాన్ని రేపుతున్నాయి. ఎవరిని పలకరించినా.. ఈ విషయంపై నే మాట్లాడుతున్నారు. ఇటీవల ఓ పాత్రికేయుడు తనకు సన్నిహితంగా ఉండే..విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీతో మాట్లాడినప్పుడు.. తిరుపతి ఉప ఎన్నిక విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో సదరు దూకుడుగా ఉండే.. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్సీ.. మా నాయకుడికే కాదు.మాకు, పార్టీకి కూడా తిరుపతి ఉప ఎన్నిక చాలా కీలకం. అయితే.. ఎలా వెళ్లాలనే దానిపై వ్యూహం సిద్ధం చేసుకుంటున్నాం!
అని వ్యాఖ్యానించారు.
ఇక, ఇదే విషయంపై ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా తర్జన భర్జన పడుతున్నారు. ఇక, ఇప్పటి వరకు ఉన్న ప్రధాన అవకాశాలను పరిశీలిస్తే.. టీడీపీ ఒంటరిగా ఇక్కడ గెలిచింది లేదు. పైగా.. పార్లమెం టు స్థానానికి ఉప ఎన్నిక రావడం ఇదే ప్రథమం. దీంతో దీనిని ఎదుర్కొనేందుకు.. విజయం సాధించేందుకు చతుర్ముఖ వ్యూహం అనుసరించాలని తమపార్టీ నిర్ణయించుకున్నట్టు.. సీనియర్ మాజీ మంత్రి ఒకరు చెప్పారు. ఆయన చెప్పిన విషయాలను బట్టి.. టీడీపీ గెలుపుఖాయమనే అనిపిస్తోంది.
వ్యూహం 1: అభ్యర్థిని ఇప్పటికే ఖరారు చేశారుకనుక.. ఎలాంటి అసంతృప్తులకు, రెబెల్స్‌కు అవకాశం లేకుండా పోయింది. దీంతో అందరినీ ఏకతాటిపై నడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దీనికి గాను మాజీ మంత్రి పరిటాల సునీత, తెలుగు మహిళ అధ్యక్షురాలు.. వంగలపూడి అనితల నేతృత్వంలో కమిటీ వేయనున్నారు.
వ్యూహం 2: సోషల్ మీడియా ప్రచారాన్ని తీవ్రతరం చేయనున్నారు. దీనికి సంబంధించి సీబీఎన్ ఆర్మీని రంగంలోకి దింపేలా ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేసుకున్నారు. దీనికి పూర్తిగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. నేతృత్వం వహించనున్నారు.
వ్యూహం 3: గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ప్రచారం నిర్వహించనున్నారు. అదేవిధంగా చంద్రబాబు, బాలయ్యలుకూడా చివరి రెండు రోజులు ప్రచారం చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
వ్యూహం 4: తిరుపతి అభివృద్ధికి టీడీపీ చేసిన ప్రయత్నాలు, ఇప్పుడు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, రాజధాని అమరావతి, తిరుమలలో జరుగుతున్న అపచారాలు.. ఎస్సీలపై జరుగుతున్న దాడులు, అన్నా క్యాంటీన్ల ఎత్తివేత, ఇసుక కొరత.. ఇలా పలు సమస్యలను ప్రధాన ప్రచార అస్త్రాలుగా చేసుకోనున్నారు. ఇలా.. చతుర్ముఖ వ్యూహంతో ముందుకు సాగాలని నిర్నయించుకున్నట్టు టీడీపీ నేతలు చూచాయగా వెల్లడిస్తుండడం గమనార్హం.